పినపాక, జనవరి 11: భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన 69వ జాతీయ స్థాయి అండర్-17 కబడ్డీ పోటీల విజేతగా రాజస్థాన్ నిలిచింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యం లో మౌరిటెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఐదు రోజులుగా జరిగిన పోటీల్లో భాగంగా ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్‌పై విజయం సాధించింది.
నిర్ణీత సమయంలో ఇరుజట్లు 28-28తో సమంగా నిలిచినా విజేతను నిర్ణయించే ఫైవ్ రైడర్ మ్యాచ్‌లో రాజస్థాన్.. 6-5తో యూపీని ఓడించింది. ఈ పోటీల్లో సెమీస్ చేరిన తెలంగాణ.. కీలకపోరులో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడినా హర్యానాపై గెలిచి మూడో స్థానాన్ని దక్కించుకుంది. విజేతలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ గెలుపు సర్టిఫికెట్లతో పాటు ఛాంపియన్ ట్రోఫీని అందజేశారు.