బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో కీలకమైన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. వరుణుడు అంతరాయం కల్గించిన మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం వెలువడలేదు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా 2.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. సాఫీగా సాగుతున్న మ్యాచ్‌కు వర్షం ఆటంకం కల్గించింది. ఎడతెరిపిలేని వానతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. ఆటకు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
జైస్వాల్(4), రాహుల్(4) నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 252-9తో ఐదో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన భారత్..మరో 8 పరుగులు జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా (10)నాటౌట్‌గా నిలిచాడు. కమిన్స్(4-81), స్టార్క్ (3-83) రాణించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్..89-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. బుమ్రా(3-18), సిరాజ్(2-36), ఆకాశ్‌దీప్(2-28) ధాటికి కంగారూలు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకున్న తొందరలో త్వరత్వరగా వికెట్లు చేజార్చుకున్నారు. మెక్‌స్వీని(4), ఖవాజ(8), లబుషేన్ (1), మార్ష్ (2), స్మిత్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. కెప్టెన్ కమిన్స్ (22), క్యారీ (20 నాటౌట్), హెడ్ (17) అంతోఇంతో ఫర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 26 నుంచి ‘బాక్సింగ్ డే’ టెస్టు మొదలుకానుంది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్,
భారత్ తొలి ఇన్నింగ్స్: 260 ఆలౌట్,
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 89-7 డిక్లేర్డ్ (కమిన్స్ 22, క్యారీ 20 నాటౌట్, బుమ్రా3-18, సిరాజ్ 2-36), భారత్ రెండో ఇన్నింగ్స్: 8-0(జైస్వాల్ 4 నాటౌట్, రాహుల్ 4 నాటౌట్)