Duleep Trophy | బెంగళూరు: దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో టీమ్ఇండియాకు ఆడే అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు పాలుపంచుకోనున్నారు. వచ్చే నెల 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు భారత క్రికెటర్లకు ఇది మంచి సన్నాహకంగా ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తున్న తరుణంలో రోహిత్, కోహ్లీ, అశ్విన్, బుమ్రా, జడేజా, అక్షర్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ వంటి స్టార్లు దులీప్ ట్రోఫీ ఆడనున్నట్టు సమాచారం.
ఈ మేరకు భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ సైతం ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసినట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి 22 మధ్య జరుగబోయే దులీప్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.