జొహన్నెస్‌బర్గ్: క్లిష్ట పరిస్థితులకు ఎదురు నిలుస్తూ.. లోయర్ ఆర్డర్‌తో కలిసి కీలక పరుగులు జోడించే హైదరాబాదీ బ్యాటర్ హనుమ విహారిపై టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా జట్టుకు దూరంకాగా.. శ్రేయస్ అయ్యర్ కడుపునొప్పితో బాధపడుతుండటంతో విహారికి తుది జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం జట్టులో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి సీనియర్లు ఉండటంతో విహారి, అయ్యర్ అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని ద్రవిడ్ పేర్కొన్నాడు. ‘రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విహారి చక్కటి ప్రదర్శన చేశాడు. కఠిన పరిస్థితుల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో కనబర్చిన తెగువ అతడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అలాగే అయ్యర్ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ ఇద్దరికి సమయం వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిన కోహ్లీ, పుజారా, రహానే కూడా ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసినవారే’ అని ద్రవిడ్ శుక్రవారం చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన పుజారా, రహానేపై మాజీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకాలు బాదిన ఈ ఇద్దరి స్థానాలకు ప్రస్తుతం వచ్చిన ప్రమాదం ఏమీ లేదని ద్రవిడ్ పరోక్షంగా అన్నాడు.
అది జట్టు నిర్ణయమే..
జొహన్నెస్‌బర్గ్ మ్యాచ్ నాలుగో రోజు భారీ వర్షం అనంతరం తిరిగి ఆట ప్రారంభమయ్యాక బుమ్రా, అశ్విన్‌తో బౌలింగ్ దాడి ప్రారంభించడాన్ని ద్రవిడ్ సమర్థించుకున్నాడు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై బుమ్రా, షమీతో స్పెల్ ప్రారంభించి.. సఫారీలపై ఒత్తిడి పెంచాల్సింది పోయి.. అశ్విన్‌కు బౌలింగ్ ఇవ్వడంతో ప్రత్యర్థులు సులువుగా పరుగులు రాబట్టారని పలువురు విమర్శించిన నేపథ్యంలో ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘మూడో రోజు బంతి స్పిన్ అవడం గమనించాం. నాలుగో రోజు బాల్ కాస్త పొడిబారే వరకు అశ్విన్‌తో బౌలింగ్ చేయిస్తే ఫలితం సాధించవచ్చని భావించాం’అని వివరించాడు.
సిరాజ్ అనుమానమే..
రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ గాయపడ్డ హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కేప్‌టౌన్ వేదికగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం కష్టమేనని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కండరాలు పట్టేయడంతో వాండరర్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయిన సిరాజ్.. ఇంకా కోలుకోలేదని అన్నాడు. ‘సిరాజ్ పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేడు. వచ్చే నాలుగు రోజుల్లో ఫిట్నెస్ను పరీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ద్రవిడ్ అన్నాడు.