Gavaskar on Rishab Pant | టీం ఇండియా యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కాసింత సంయమనంతో.. ఓపికతో బ్యాటింగ్ చేస్తే జట్టుకు ఎంతో మేలు చేసిన వాడవుతాడని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. గొప్ప ప్రతిభ ఉన్నా నిర్లక్ష్య పూరిత షాట్లతో తరుచుగా విమర్శలను ఎదుర్కొంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్ సత్తా ఏమిటో అందరికీ తెలిసినా.. రోజురోజుకు ఆయన బ్యాటింగ్ సరళిపై అభిప్రాయాలు మారిపోతున్నాయన్నాడు. ఒక మ్యాచ్‌లో అద్భుతంగా అలరిస్తే.. మరో మ్యాచ్‌లో దారుణంగా బ్యాటింగ్ చేస్తాడని గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. క్రీజ్‌లో కుదురుకునేందుకు కాస్త టైం తీసుకున్నా పర్వాలేదు గానీ సంయమనం పాటించాలని సూచించాడు.
మొదటి పది బంతుల్లోనే పరుగులేమీ చేయకున్నా నో ప్రాబ్లం. తర్వాత వచ్చే 4 బంతులూ ఫోర్లుగా మార్చే సత్తా పంత్ సొంతం అని గవాస్కర్ గుర్తు చేశాడు. గత ఆస్ట్రేలియా టూర్లో సిడ్నీ టెస్ట్‌లో 96, బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో 89 పరుగులు చేశాడని చెప్పాడు. పంత్ బ్యాటింగ్ స్టైల్.. ఆయనలోని ప్రతిభ, సామర్థ్యంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ అతడితో మాట్లాలని సూచించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ జట్టుకు ఎంత కీలకమో అర్థమయ్యేలా చెప్పాలన్నాడు.
పంత్ 300 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదని, జట్టు పరిస్థితులకు అనుగుణంగా రాణిస్తే చాలునని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇటీవల సఫారీల గడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన రెండో, మూడో టెస్ట్ మ్యాచల్లో రిషబ్ పంత్ నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో సఫారీలపై పంత్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.