బెంగళూరు: అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువ ఆటగాళ్లకు టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. శుక్రవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఈశాన్య రాష్ర్టాల ఆటగాళ్లతో ద్రవిడ్ భేటీ అయ్యాడు. గతంలో అండర్-19 కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్.. ప్రస్తుతం ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి యువ ఆటగాళ్లకు విలువైన సలహాలిచ్చాడు. 45 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ జట్టుతో పాటు, రంజీ ప్లేట్ గ్రూప్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ‘తన అమూల్యమైన సమయం వెచ్చించి యువ ఆటగాళ్లకు సలహాలిచ్చింనందుకు.. నా మిత్రుడు, భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ధన్యవాదాలు. కొత్త కుర్రాళ్లకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి’ అని సమావేశం అనంతరం లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ఇందులో మిజోరాం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ర్టాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారని బీసీసీఐ అధికారి తెలిపారు.