నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: దేశావాళీల్లో పటిష్ఠమైన వ్యవస్థాగత నిర్మాణంతో ఇటీవలి కాలంలో భారత జట్టులో పోటీ విపరీతంగా పెరిగింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే.. యువ ఆటగాళ్లతో కూడిన మరో భారత జట్టు.. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తుది జట్టులోని ఒక్కో స్థానం కోసం ముగ్గురేసి ఆటగాళ్లు ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో.. ప్రతి ఒక్కరిపై ఒత్తిడి ఎక్కువైంది. చాన్నాళ్లుగా భారత టెస్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. కోహ్లీ అందుబాటులో లేని ప్రతిసారీ నాయకుడిగా జట్టును ముందుకు నడిపిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్న రహానేకు కాన్పూర్ టెస్టులో అవకాశం దక్కడమే కష్టంగా కనిపించినా.. కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్‌గా తుది జట్టులో చోటు నిలబెట్టుకోగలిగాడు. న్యూజిలాండ్‌తో పోరులో బ్యాటర్‌గా ప్రభావం చూపలేకపోయిన రహానే.. సారథిగానూ ఆకట్టుకోలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే విషయంతో పాటు.. ఆఖరి రోజు న్యూజిలాండ్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడని పలువురు మాజీలు బాహాటంగానే పెదవి విరిచారు.
డిఫెన్సివ్ మైండ్‌సెట్‌తో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వడంతో పాటు బౌలర్లను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడంతోనే తొలి మ్యాచ్ ‘డ్రా’ అయిందనే వాదనలు వినిపించాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇక రహానేకు భవిష్యత్తులో అవకాశాలు దక్కడం కష్టంగానే కనిపిస్తున్నది. అరంగేట్ర మ్యాచ్‌లోనే చక్కటి ప్రదర్శన కనబర్చిన శ్రేయస్ అయ్యర్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారి వంటి వాళ్లు మిడిలార్డర్లో చోటు కోసం పోటీపడుతున్న నేపథ్యంలో రహానేను కొనసాగించడం బోర్డుకు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది. శ్రేయస్‌ను పక్కనపెట్టే చాన్స్ లేకపోవడంతోనే టీమ్ మేనేజ్మెంట్ ‘గాయం’ సాకుతో ముంబై టెస్టుకు రహానేను తుది జట్టు నుంచి మర్యాదపూర్వకంగా తప్పించిందనేది బహిరంగ రహస్యమే. అయితే పేస్‌కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై మిడిలార్డర్లో అనుభవజ్ఞుడైన రహానేను ఎంపిక చేస్తారా.. లేక యువ ఆటగాళ్లకే అవకాశమిస్తారా అనే దాని మీదే అజింక్యా కెరీర్ ఆధారపడి ఉంది.
సఫారీ టూర్‌కు రహానేను పరిగణించకపోతే ఇక అతడి కెరీర్ దాదాపు ముగిసినట్లే! ముంబై టెస్టు ప్రారంభానికి ముందు రహానేతో పాటు ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించిన బోర్డు అందుకు గాయాలను కారణంగా చూపింది. అయితే కాన్పూర్ టెస్టులో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఇషాంత్‌ను తప్పిస్తారని ముందే ఊహించినా.. గాయం సాకు చూపి వెటరన్ పేసర్‌ను గౌరవంగా పక్కనపెట్టింది. వీరి గాయాలను వివరించేందుకు భారత ఫిజియోలు పడ్డ కష్టాలు చూస్తే.. ఇవి ‘బలవంతపు గాయాల’నే విషయం స్పష్టమవుతున్నది. ఇప్పటికే వందకు పైగా టెస్టులు ఆడిన ఇషాంత్ యువ ఆటగాళ్లకు దారివ్వకుండా ఇంకా కొనసాగుతుండటంతో పాటు అతడి బౌలింగ్‌లో మునుపటి వాడి తగ్గడంతో బోర్డు పొమ్మనలేక పొగబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తున్నది!