Qatar FIFA | ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్’ వేడుకలు ముంగిట్లోకి వచ్చేశాయి. ఈ ఫిఫా టోర్నీకి ఖతార్ ఆతిధ్యం ఇస్తున్నది. కనీ వినీ ఎరుగని రీతిలో టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 (ఆదివారం) ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ టోర్నీ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది.
దేశవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగే ఎనిమిది స్టేడియంల వద్ద బీర్ల విక్రయంపై నిషేధం విధించింది. ఈ విషయమై ఖతార్ ప్రభుత్వానికి, ఫుట్‌బాల్ గ్లోబల్ గవర్నింగ్ బాడీ ‘ఫిఫా’కు మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. తొలుత ఫిఫా వరల్డ్ కప్ స్పాన్సరర్ బుడ్వైజర్ బీర్లు మాత్రమే ఖతార్‌లోని స్టేడియంల వద్ద విక్రయించడానికి అనుమతించారు.
స్టేడియంల్లో అల్కాహాల్ విక్రయాల విషయమై ఖతార్ సర్కార్ యూ-టర్న్ తీసుకున్నది. స్టేడియంల బయట డిజిగ్నేటెడ్ ‘ఫ్యాన్ జోన్స్’, ఇతర ఆతిథ్య వేదికల వద్ద ఆల్కాహాల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఖతార్ సుప్రీం కమిటీ ఆన్ డెలివరీ అండ్ లెగసీ హామీ ఇచ్చింది. గత సెప్టెంబర్‌లోనూ ఖతార్ వరల్డ్ కప్ ఆర్గనైజర్లు కూడా స్టేడియంల వద్ద, ఫ్యాన్స్ జోన్స్ పరిధిలో బీర్ విక్రయాలను అనుమతిస్తూ విధాన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఖతార్‌లో ఆల్కాహాల్ విక్రయాలపై నిషేధం దాదాపు అన్నిరెస్టారెంట్లకు వర్తిస్తుంది. అయితే విలాసవంతమైన హోటల్ లేదా రిసార్ట్‌కు ఈ నిషేధం వర్తించకపోవచ్చు. దోహా నగర శివారుల్లో ఖతార్ ఎయిర్వేస్ నిర్వహిస్తున్న డిపో నుంచి విదేశీయులు తమ ఇంటికి తీసుకెళ్లేందుకు లిక్కర్, బీర్, వైన్ కొనుగోళ్లు చేసేందుకు అనుమతి ఉంది.
ఈ నెల 20న ఈక్వెడార్‌తో ఆతిథ్య ఖతార్ జట్టు తలపడటంతో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అయితే, వలస కార్మికుల పట్ల ఖతార్ ప్రభుత్వ వ్యవహార శైలి, వేసవి సమ్మర్ హీట్ వల్ల టోర్నమెంట్ నిర్వహణ ఏర్పాట్లపై సమస్యలు వెలుగు చూశాయి. 1986 నుంచి ఫిఫా, బుడ్వైజర్ మేకర్ ఏబీ ఇన్బెవ్తో భాగస్వామ్య ఒప్పందం కొనసాగుతున్నది. ఫిఫా వరల్డ్ కప్ వేదికల వద్ద రాయితీలపై మద్యం విక్రయాలు చేసుకునేందుకు బుడ్వైజర్కు అనుమతి ఉంది. 2014 వరల్డ్ కప్‌లో మాత్రం మద్యం విక్రయాలు జరుగలేదు. బ్రెజిల్ చట్టాల ప్రకారం దేశంలోని స్టేడియంల వద్ద మద్యం అమ్మకాలపై నిషేధం అమలులో ఉంది.