పారిస్ : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఆరో పతకం దక్కించుకోవాలన్న పీవీ సింధు కల చెదిరింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు.. 14-21, 21-13, 16-21తో తొమ్మిదో సీడ్ ఇండోనేషియా అమ్మాయి పుత్రి కుసుమ వర్దాని చేతిలో పోరాడి ఓడింది. 64 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో ఈ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్.. తొలి గేమ్‌లో ఓడినా తర్వాత పుంజుకుని రేసులోకి వచ్చింది. తన అనుభవన్నంతా రంగరించి రెండో గేమ్‌ను గెలుచుకున్న తెలుగమ్మాయి.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తడబాటుకు గురై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
2013లో తొలిసారిగా ఈ టోర్నీలో పతకం గెలిచిన సింధు.. ఆ తర్వాత కోపెన్‌హగన్, గ్లాస్గో, నన్జింగ్లోనూ మెడల్స్ సాధించింది. 2019 బాసెల్ టోర్నీలో స్వర్ణం సాధించిన ఆమె.. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నది. ఇదే టోర్నీలో క్వార్టర్స్ చేరిన భారత మిక్స్డ్ డబుల్స్ ద్వయం ధృవ్ కపిల-తనీషా క్రాస్టో సైతం కీలకపోరులో పరాజయం పాలయ్యారు. క్వార్టర్స్‌లో భారత జోడీ.. 15-21, 13-21తో మలేషియాకు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకు జోడీ టాంగ్ జీ- టో యి వీ చేతిలో ఓడారు.