PV Sindhu: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్ లక్ష్యంగా సిద్ధమవుతోంది. 2022లో కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయంతో సతమతమైన తెలుగమ్మాయి.. మునపటి ఆటను అందుకోలేక తంటాలు పడుతోంది. అయితే వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్ లక్ష్యంగా సిద్ధమవుతున్న సింధు.. ప్రముఖ షట్లర్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్ ప్రకాశ్ పదుకునే శిక్షణలో ఆమె రాటుదేలుతోంది. ఈ మేరకు ఆమె ప్రకాశ్ పదుకునేను తన మెంటార్‌గా నియమించుకున్నట్టు ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది.
శనివారం ఆమె ట్విటర్లో స్పందిస్తూ.. ‘అవును, ప్రకాశ్ సార్ నాకు మెంటార్‌గా పనిచేస్తున్నారు. గత ఆగస్టు నుంచి నేను ఆయన శిక్షణలోనే ఉన్నాను. అప్పట్నుంచి నా కెరీర్లో మళ్లీ ముందంజ వేస్తున్నాను. ఆయన నాకు మెంటార్ కంటే ఎక్కువ. ఆయన నా గైడ్, నా గురువు, అన్నింటికీ మించి నిజమైన స్నేహితుడు. ఆయన శిక్షణలో నా ఆటలో చాలా మార్పులు వచ్చాయి. నేను జపాన్‌లో ఉన్నప్పుడు ఒకసారి ఒక్క ఫోన్ కాల్ ద్వారా నా అభ్యర్థనను మన్నించారు…’ అని రాసుకొచ్చింది.
For those wondering and constantly asking me 😅, the cat is finally out of the bag!!
Prakash sir is assuming the role of the mentor in my setup. I started training with him at the end of August, and it’s been uphill ever since. He’s more than a mentor; he’s my guide, my guru,… pic.twitter.com/KxYlo4dyBd
— Pvsindhu (@Pvsindhu1) November 18, 2023
ఒలింపిక్స్ లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్న సింధు ఆ మేరకు బెంగళూరులో ఉన్న ప్రకాశ్ పదుకునే అకాడమీలో శిక్షణ పొందుతోంది. గత ఏడాదిన్నర కాలంగా సింధు ప్రదర్శన స్థాయికి తగ్గట్టుగా లేదు. ఈ ఏడాది ఆమె మలేషియాకు చెందిన మాజీ దిగ్గజం మహబూబ్ అలీని కోచ్‌గా నియమించుకున్న తర్వాత కాస్త మెరుగయ్యింది. ఈ ఏడాది అర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, కెనడా ఓపెన్, మలేషియా మాస్టర్స్‌లో సింధు ఫర్వాలేదనిపించింది.