నడి వయసు దాటితే మెట్లు ఎక్కడానికే సంకోచిస్తున్న రోజులివి. ముదిమి వచ్చిందంటే అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటారంతా. కానీ, ఎనభై ఆరేండ్ల కిమ్ నోర్ మాత్రం రోజూ సాహసం చేయాలని కోరుకుంటుంది. అదే పనిగా ప్రయత్నిస్తుంది. ఆమెకు స్కై డైవింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈ మధ్యనే ఆమె వెయ్యో స్కై డైవింగ్‌ని న్యూవేల్ (ఫ్లోరిడా, అమెరికా)లో పూర్తి చేసింది. ఈ మైలురాయి తన బిడ్డలకూ గుర్తుండేలా ఇద్దరు కూతుళ్లనూ వెంట బెట్టుకుని దూకింది. కిమ్‌కి చిన్నప్పటి నుంచి సాహసాలంటే ఇష్టం. పద్దెనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు స్కై డైవింగ్ చేయాలనుకుంది.
ఇంట్లో అనుమతించలేదు. అనుమతిలేకుండా స్కై డైవింగ్ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. పెద్దల సంతకం కూడా తానే పెట్టి, అనుకున్న పని పూర్తిచేసింది. అప్పటి నుంచి డైవింగ్ చేస్తూనే ఉంది. అమెరికాలో ఏర్పడిన మొదటి మహిళా పారాచూట్ బృందంలో కిమ్ సభ్యురాలు. స్కై డైవింగ్ ఆమెకు ఎంత ఇష్టమైనదైనా పిల్లలు అంతకంటే ఎక్కువ ఇష్టం. అందువల్ల పిల్లలు ఎదిగేంత వరకు స్కై డైవింగ్‌ని పక్కనపెట్టింది.
పిల్లలు పెద్దయ్యే సరికి కిమ్ వయసు పైబడింది. అయినా ఆమె మనసు ఇంకా ఉత్సాహంతోనే ఉంది. సాధన చేసి మళ్లీ స్కై డైవింగ్ చేయడం మొదలుపెట్టింది. పదులు, వందలు దాటి వెయ్యోసారి స్కై డైవింగ్ చేసి చరిత్ర సృష్టించింది. పదిహేనేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ స్కై డైవింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది కిమ్. యునైటెడ్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ గోల్డ్ వింగ్స్ అవార్డ్ గెలుచుకుంది. సాహసాలు చేయడానికి వయసు ఆటంకం కాదని ఆమె నిరూపించింది. ఆమె గుండె ధైర్యానికి ఔరా అని మెచ్చుకుంటున్నారు. అందుకే అమెరికా ప్రజలు ఆమెను ‘స్కై డైవింగ్ గ్రాండ్ మా’ అని పిలుచుకుంటున్నారు.