స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. డేటింగ్ యాప్‌లలో స్వైప్‌ల మీద స్వైప్‌లు.. లెఫ్ట్ అంటే నో, రైట్ అంటే ఓకే! ముఖం చూడక్కర్లేదు, మాట వినక్కర్లేదు.. ప్రొఫైల్ నచ్చితే చాలు ‘హాయ్’ అనేస్తాం. కానీ, ఈ వర్చువల్ ప్రేమాయణాల్లో జెన్-జీ పాత నమ్మకాలను పక్కన పెట్టేస్తున్నది. సరికొత్త ‘ఎమోషనల్ బౌండరీస్’ సెట్ చేస్తున్నది. డేటింగ్ లోకాన్ని షేక్ చేస్తున్న న్యూ ట్రెండ్స్ ముచ్చట్లెంటో తెలుసా?
ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా? కానీ, ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న బ్రేకప్ వ్యూహం. ఒక వ్యక్తితో విడిపోవాలని ఉన్నా.. వెంటనే చెప్పే ధైర్యం లేక, ఆ బంధాన్ని అలా లాగుతూనే ఉంటారు. ఎంతవరకు అంటే.. అవతలి వ్యక్తి అంటే పరమ అసహ్యం పుట్టే వరకు! సింపుల్‌గా చెప్పాలంటే.. ఈ మధ్య కాలంలో రష్మిక నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా స్టోరీలా అన్నమాట. ఫోన్లో మెసేజ్‌లు వస్తున్నా.. ఎమోషనల్‌గా ‘చెక్ అవుట్’ అయిపోతారు.
లోపల కోపం పెంచుకుంటూ, ఉదాసీనంగా కాలక్షేపం చేస్తారు. ఎందుకిలా అంటే.. ప్రేమించిన వ్యక్తి ఎదురుదాడి చేస్తారన్న అభద్రత! అవతలి వ్యక్తిని బాధపెట్టినట్టు అవుతుందన్న జాలి, ఒంటరితనం పట్ల ఉండే భయమే దీనికి కారణాలు. కానీ గుర్తుంచుకోండి.. ఇలా అసహ్యాన్ని పెంచుకుంటూ పోతే మీ మెంటల్ హెల్త్ పాడైపోవడమే కాదు, భవిష్యత్తులో వచ్చే కొత్త రిలేషన్స్‌పై కూడా ఆ మచ్చ పడుతుంది. అందుకే నచ్చని వెంటనే.. నో చెప్పేయండి.
డిజిటల్ వరల్డ్‌లో ఎక్కడో ఉన్న వారితో చాటింగ్ చేయడం పాత ైస్టెల్. ఇప్పుడు అంతా ‘జిప్ కోడింగ్’ మయం. అంటే.. కేవలం డిజిటల్ మ్యాచింగ్ మాత్రమే కాదు.. మన ఊళ్లోనో, మన ఏరియా పిన్కోడ్లోనో ఉండేవారికే ‘రైట్ స్వైప్’ చేయడం అన్నమాట. ఎందుకంటే.. స్క్రీన్‌పై వర్చువల్ టూర్లు కాకుండా.. రియల్ లైఫ్‌లో కలిసే అవకాశం ఉన్నవారికే ప్రయారిటీ అనే ఆలోచనతో ఈ తరహా డేటింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారట ఇప్పటివాళ్లు. లాంగ్ డిస్టెన్స్ తలనొప్పులు పడలేక చాలామంది ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. భౌగోళిక సామీప్యత ఉంటేనే ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుందని నమ్ముతున్నారు. షేరింగ్స్.. లైఫ్ ైస్టెల్లోనూ చక్కని సింక్ ఉంటుందనే కంఫర్ట్ కోరుకుంటున్నారు.
ఎప్పుడూ ఒకే రకమైన వ్యక్తుల వెనక పడుతున్నారా? అయితే, మీరు రొటీన్. కొందరు భిన్నంగా ‘కాంట్రా-డేటింగ్’ ట్రై చేయడానికి ఇష్టపడుతున్నారట. అలవాటైన పద్ధతికి భిన్నంగా ఉండే వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అందుకు ప్రొఫైల్ సెట్టింగ్స్ మార్చండి. మీకు నచ్చే రొటీన్ గుణాలు లేకపోయినా.. కొన్నిటిని యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇదో గొప్ప డేటింగ్ చాన్స్!!
బంధంలో ఒకరే ఎమోషనల్ మేనేజర్‌గా స్టాండ్ తీసుకుంటున్నారట. ముఖ్యంగా అమ్మాయిలే ఈ మ్యాన్ కీపింగ్ ట్రెండ్ బాధితులు అవుతున్నారట. సామాజిక సంబంధాలు, ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ ఒకరిపైనే పడితే అది ‘మ్యాన్కీపింగ్’ కిందకే వస్తుంది. అవతలి వారు కేవలం పాసివ్ పార్టిసిపెంట్‌గా ఉంటే అది బంధంలోని ఆత్మీయతను మెల్లమెల్లగా తినేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా.. ఒక్కటే!! అయితే.. రిలేషన్స్‌లోనే ట్రెండ్స్ మారుతుంటాయ్. మనశ్శాంతిని, విలువల్ని తాకట్టు పెట్టకుండా ‘స్మార్ట్’గా డేటింగ్ చేయండి. ఆన్లైన్లో పరిచయాలు పెంచుకున్నా.. రియల్ లైఫ్‌లో క్లారిటీతో ముందుకు సాగండి.