PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధూకు ఈ ఏడాది ఆటలో ఏమాత్రం కలిసిరాలేదు. ఈ ఏడాది ఒక్క ట్రోఫీ కూడా నెగ్గని సింధూ సంపాదనలో మాత్రం వెనుకంజ వేయలేదు. 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదించిన మహిళా అథ్లెట్ల జాబితాలో ఈ తెలుగమ్మాయి.. 16వ స్థానంలో ఉంది. ప్రతి ఏడాది ఈ వివరాలను వెల్లడించే ఫోర్బ్స్ తాజాగా 2023 వివరాలను ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో వరుస వైఫల్యాలు ఎదుర్కుంటున్నా 2023లో సింధు సంపాదన 7.1 మిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. ఈ జాబితాలో టెన్నిస్ తార, పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ అగ్రస్థానంలో ఉంది.
గత కొన్నేండ్లుగా ఈ జాబితాలో ఉంటున్న సింధూ.. 2018లో టాప్-10లో నిలిచింది. ఆ ఏడాది సింధూ.. 8.5 మిలియన్ డాలర్లతో అత్యధిక సంపాదనను ఆర్జించే మహిళా అథ్లెట్లలో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ ఆమెకు ఇదే బెస్ట్. గతేడాది కూడా దాదాపు ఇంతే అమౌంట్‌తో ఉన్నా 12వ ర్యాంకులో నిలిచింది. ఈ జాబితాలో సింధుకు ముందు 16వ స్థానంలో అమెరికా జిమ్నాస్టిక్స్ అథ్లెటిక్ సిమోన్ బైల్స్ (7.1 మిలియన్ డాలర్లు) ఉండగా 18వ స్థానంలో ట్యూనిషియా టెన్నిస్ క్రీడాకారిణి ఒన్స్ జబేర్ (5.7 మిలియన్ డాలర్లు) నిలిచారు.
గతేడాది కామన్వెల్త్ క్రీడల తర్వాత గాయాలపాలైన సింధూ.. ఫిబ్రవరిలో రికవరీ అయింది. కానీ ఆటలో మునపటి లయను అందుకోవడంలో విఫలమవుతూనే ఉంది. పాత కోచ్‌ను మార్చినా ఫలితం మాత్రం శూణ్యం. పలు టోర్నీలలో క్వార్టర్స్ చేరుకోవడానికే తంటాలు పడ్డ ఆమె.. ఈ ఏడాది మ్యాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. డెన్మార్క్ ఓపెన్, ఆర్కిటిక్ ఓపెన్లలో ఆమె సెమీస్‌తోనే సరిపెట్టుకుంది.
Indian #badmintonicon @Pvsindhu1 🇮🇳 has once again made the Forbes list of the world’s highest-paid women athletes.
More 👉https://t.co/yWRol24rNkhttps://t.co/CgPeQlbDn3
— BWF (@bwfmedia) December 22, 2023
టాప్ – 10 హయ్యస్ట్ పెయిడ్ ఫిమేల్ అథ్లెట్స్ లిస్ట్
– ఇగా స్వియాటెక్ (టెన్నిస్) : 23.9 మిలియన్ డాలర్లు
– ఎలిన్ గూ (ఫ్రీస్టయిల్ స్కైయింగ్) : 22.1 మి.డా.
– కోకో గాఫ్ (టెన్నిస్) : 21.7 మి.డా.
– ఎమ్మా రాడుకాను (టెన్నిస్) : 15.2 మి.డా.
– నవోమి ఒసాకా (టెన్నిస్) : 15 మి.డా.
– అరినా సబలెంక (టెన్నిస్) : 14.7 మి.డా.
– జెస్సికా పెగుల (టెన్నిస్) : 12.5 మి.డా.
– వీనస్ విలియమ్స్ (టెన్నిస్) : 12.2 మి.డా.
– ఎలినా రిబాకినా (టెన్నిస్) : 9.5 మి.డా.
– లైలా ఫెర్నాండెజ్ (టెన్నిస్) : 8.8 మి.డా.