Eyes Swelling | మనలో చాలా మంది కళ్ల కింద సంచులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కళ్ల కింద చర్మం వాపులకు గురవడం వల్ల ఇలా జరుగుతుంది. వీటిని ఉబ్బిన కళ్లు, కళ్ల కింద వాపు, కళ్ల సంచులు ఇలా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరినీ ఈ సమస్య వేధిస్తుంది. దీని వల్ల ముఖం అంద విహీనంగా కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, చర్మసంరక్షణను పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కళ్ల కింద సంచులతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే 5 విధాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కళ్ల కింద చర్మం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుంది, కళ్ల అందం పెరుగుతుంది. కళ్ల కింద వాపులకు గురైన చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకు వచ్చే 5 విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది వీపు, తలకు మాత్రమే మసాజర్లు ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఫేషియల్ రోలర్, కూలింగ్ ఐ రోలర్ వంటివి కూడా మనకు మార్కెట్ లో లభిస్తూ ఉంటాయి. వీటితో రాత్రిపూట కళ్ల చుట్టూ మసాజ్ చేయడం వల్ల చర్మానికి ఉపశమనం కలిగి చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. కళ్ల కింద వాపులు తగ్గుతాయి. సోడియంను ఎక్కువగా తీసుకోవడం వల్ల కళ్ల కింద వాపు వస్తుంది. అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలిచి ఉంటుంది. దీంతో చర్మం వాపులకు గురైనట్టు ఉంటుంది. కళ్ల కింద కూడా అదే జరిగే అవకాశం ఉంది. కనుక ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. రాత్రి పడుకునే సమయంలో ముఖానికి ఎటువంటి మేకప్ లేకుండా చూసుకోవాలి. మేకప్ తొలగించిన తరువాతే నిద్రించాలి. మేకప్ తొలగించకపోవడం వల్ల మస్కారా, లైనర్ వంటి వాటిలో ఉండే అవశేషాలు కంటిలో చిక్కుకుని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీని వల్ల కళ్ల నుండి నీరు కారడం, కళ్ల కింద ఉబ్బినట్టుగా ఉండడం వంటివి జరుగుతాయి. కనుక రాత్రి నిద్రించే ముందు మేకప్ ను తొలగించడం చాలా అవసరం.
కళ్ల కింద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కనుక హాని కలిగించని క్రీములను వాడాలి. కళ్ల కింద వచ్చిన ఉబ్బరాన్ని తగ్గించడానికి, అలసటను తగ్గించడానికి వోట్రే ఐ క్రీమ్ ను వాడాలి. దీనిని ఉపయోగించడం వల్ల కళ్ల కింద ఉబ్బరం తగ్గుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కళ్ల కింద వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. కనుక రోజూ 6 నుండి 8 గంటల పాటు అంతరాయం లేని నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టీవీ, సెల్ఫోన్, ల్యాప్ట్యాప్ ల వినియోగాన్ని కూడా తగ్గించాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, చక్కటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కళ్ల కింద చర్మం వాపు తగ్గుతుంది.