నింగ్బొ (చైనా): బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో రెండో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధుతో పాటు కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ వంటి స్టార్ షట్లర్లు ప్రిక్వార్టర్స్‌కు చేరినా లక్ష్యసేన్, ప్రణయ్, మాళవిక, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్ విఘ్నాన్ని దాటలేకపోయారు. మహిళల సింగిల్స్‌లో సింధు 21-15, 21-9తో ఎస్తర్ నురుమి (ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో రజావత్ 20-22, 21-12, 21-10తో వాంగ్‌చరొన్(థాయ్‌లాండ్) పై పోరాడి గెలిచాడు. జార్జి 21-16, 21-8తో పనరిన్ (కజకిస్థాన్)ను చిత్తుగా ఓడించాడు. కానీ టోర్నీ ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగిన లక్ష్యసేన్ 21-18, 21-10తో లి చియా హో(తైవాన్) చేతిలో పరాభవం పాలయ్యాడు. మరో పోరులో ప్రణయ్ 16-21, 21-12, 11-21తో లు గువాంగ్జు (చైనా) చేతిలో చిత్తయ్యాడు. ఈ ఏడాది ఆడిన ఆరు టోర్నీలలో తొలి రౌండ్లోనే వెనుదిరగడం అతడికి ఇది నాలుగోసారి కావడం గమనార్హం.