బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్ మరో కీలక టోర్నీకి సిద్ధమయ్యారు. బ్యాంకాక్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న థామస్ అండ్ ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో వీరిద్దరి నేతృత్వంలో భారత జట్లు అదృష్టం పరీక్షించుకోనున్నాయి. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించగా.. టాప్‌లో నిలిచిన రెండు జట్లు నాకౌట్ దశకు వెళ్తాయి.
ఈ టోర్నీలో ఉబర్ కప్ గ్రూప్ ‘డీ’లో సింధు, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా, తానీషా క్రాస్టో-శ్రుతి మిశ్రా, సిమ్రన్ సింఘీ-రితిక థాకర్, త్రిష జాలీతో కూడిన భారత మహిళల బృందం బరిలోకి దిగనుంది. థామస్ కప్ గ్రూప్- సీలో లక్ష్యసేన్‌తోపాటు స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, అర్జున్- ధ్రువ్ కపిల్, కృష్ణప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్ సత్తా చాటేందుకు సై అంటున్నారు.