ముందడుగు వేయడం కష్టమే అనుకున్న దశలో పంజాబ్ కింగ్స్ చక్కటి విజయం సాధించగా.. స్వయంకృతాపరాధాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్ మూల్యం చెల్లించుకుంది. దీంతో ఐపీఎల్ 14వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది.9 విజయాలు సాధించిన చెన్నై ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టగా.. తాజా ఫలితంతో ఢిల్లీ కూడా ముందంజ వేసింది. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం బెంగళూరు, కోల్‌కతా, పంజాబ్, ముంబై, రాజస్థాన్ పోటీపడుతున్నాయి. ఇందులో బెంగళూరు 14 పాయింట్లతో ఒక అడుగు ముందుండగా.. కోల్‌కతా, పంజాబ్, ముంబై తలా పదేసి పాయింట్లతో ఉన్నాయి!
దుబాయ్: ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సమిష్టిగా సత్తాచాటింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (49 బంతుల్లో 67; 9 ఫోర్లు, ఒక సిక్సర్) మరో చక్కటి ఇన్నింగ్స్‌తో అలరించగా.. రాహుల్ త్రిపాఠి (34; 3 ఫోర్లు, ఒక సిక్సర్), నితీశ్ రాణా (31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టారు. ఒక దశలో కోల్‌కతా భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించినా.. చివరి ఓవర్లలో మహమ్మద్ షమీ (1/23), అర్షదీప్ చెలరేగిపోయారు. అనంతరం లక్ష్యఛేదనలో కెప్టెన్ లోకేశ్ రాహుల్ (67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకానికి, మయాంక్ అగర్వాల్ (40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షారుక్ ఖాన్ (22 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో పంజాబ్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
స్కోరు బోర్డు
కోల్‌కతా: వెంకటేశ్ (సి) హుడా (బి) రవి 67, గిల్ (బి) అర్ష్‌దీప్ 7, త్రిపాఠి (సి) హుడా (బి) రవి 34, రాణా (సి) మయాంక్ (బి) అర్ష్‌దీప్ 31, మోర్గాన్ (ఎల్బీ) షమీ 2, కార్తీక్ (బి) అర్ష్‌దీప్ 11, సీఫెర్ట్ (రనౌట్/షమీ) 2, నరైన్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 165/7. వికెట్ల పతంన: 1-18, 2-90, 3-120, 4-124, 5-149, 6-156, 7-165, బౌలింగ్: అలెన్ 4-0-38-0, షమీ 4-0-23-1, అర్ష్‌దీప్ 4-0-32-3, ఎలీస్ 4-0-46-0, రవి 4-0-22-2.
పంజాబ్: రాహుల్ (సి) మావి (బి) అయ్యర్ 67, మయాంక్ (సి) మోర్గాన్ (బి) వరుణ్ 40, పూరన్ (సి) మావి (బి) వరుణ్ 12, మార్క్మ్ (సి) గిల్ (బి) నరైన్ 18, హుడా (సి) త్రిపాఠి (బి) మావి 3, షారుక్ (నాటౌట్) 22, అలెన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 19.3 ఓవర్లలో 168/5. వికెట్ల పతనం: 1-70, 2-84, 3-129, 4-134, 5-162, బౌలింగ్: సౌథీ 4-0-40-0, మావీ 4-0-31-1, వరుణ్ 4-0-24-2, నరైన్ 4-0-34-1, వెంకటేశ్ 2.3-0-30-1, రాణా 1-0-7-0.