వారం రోజుల వాయిదా తర్వాత శనివారం పునఃప్రారంభమైన ఐపీఎల్-18లో తొలి మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు అభిమానుల్లో జోష్‌ను నింపాయి. జైపూర్‌లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్‌లో టాపార్డర్ విఫలమైనా నెహల్, శశాంక్ మెరుపులతో భారీ స్కోరు సాధించిన ఆ జట్టు.. ఛేదనలో రాయల్స్‌ను నిలువరింంచింది. అనంతరం రెండో మ్యాచ్‌లో గుజరాత్.. ఢిల్లీని ఓడించడంతో ఆ జట్టుతోపాటు పంజాబ్, బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాయి.
జైపూర్: ఈ సీజన్లో సమిష్టి ప్రదర్శనతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరింది. ఆదివారం జైపూర్ వేదికగా ఆ జట్టు.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 10 పరుగుల తేడాతో ఓడించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్.. నెహల్ వధెర (37 బంతుల్లో 70, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 219/5 స్కోరు సాధించింది. రికార్డు ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 209/7 వద్దే ఆగిపోయింది. ధ్రువ్ జురెల్ (31 బంతుల్లో 53, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), యశస్వీ జైస్వాల్ (25 బంతుల్లో 50, 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడినా ఆఖర్లో తడబడ్డ ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. కింగ్స్ గెలుపులో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రర్ (3/22)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 11 ఏండ్ల తర్వాత ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరడం పంజాబ్‌కు ఇదే మొదటిసారి.
భారీ ఛేదనలో రాయల్స్‌ది పాత కథే! ఓపెనర్లు మెరుపు వేగంతో పరుగులు రాబట్టి బలమైన పునాది వేసినా మిడిలార్డర్ తడబడటం, విజయం ముంగిట బోల్తా కొట్టడాన్ని ఈ సీజన్లో ఆనవాయితీగా మలుచుకున్న ఆ జట్టు.. పంజాబ్‌తోనూ దానినే కొనసాగించింది. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ మొదటి బంతినుంచే దంచుడు మంత్రాన్ని జపించడంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు స్కోరు 89/1గా నిలిచింది. అర్ష్‌దీప్ తొలి ఓవర్లోనే జైస్వాల్.. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు రాబడితే యాన్సెన్ రెండో ఓవర్లో వైభవ్.. 6, 4, 6తో 17 రన్స్ పిండుకున్నాడు. 2.5 ఓవర్లకే రాజస్థాన్ 50 రన్స్ మార్కును అందుకుంది. అయితే పంజాబ్ సారథి శ్రేయాస్ స్థానంలో ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన బ్రర్.. మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చాడు. ఐదో ఓవర్లో బంతినందుకున్న అతడు.. ఐదో బంతికి వైభవ్‌ను ఔట్ చేసి రాయల్స్‌ను తొలి దెబ్బ కొట్టడంతో 76 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మూడో స్థానంలో వచ్చిన శాంసన్ (20)తో కలిసి జోరును కొనసాగించిన జైస్వాల్ 24 బంతుల్లో ఈ సీజన్లో ఆరో అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే అతడు లాంగాఫ్ వద్ద మిచెల్ చేతికి చిక్కాడు. ఈ వికెట్ కూడా బ్రర్కే దక్కింది. అక్కడ్నుంచి రాయల్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. శాంసన్, పరాగ్ (13), హెట్మయర్ (7) విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా క్రీజులో నిలిచిన జురెల్.. ఒంటరిపోరాటంతో రాయల్స్‌లో గెలుపు ఆశలు నింపాడు. కానీ చివరి ఓవర్లో యాన్సెన్ అతడిని ఔట్ చేయడంతో రాజస్థాన్ ఓటమి ఖరారైంది. ఈ సీజన్లో రాజస్థాన్ 9 మ్యాచ్‌లలో ఛేదనకు దిగి ఏకంగా 8 మ్యాచ్‌లు ఓడిపోవడం గమనార్హం.
34/3.. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 ఓవర్లకు చేసిన స్కోరిది. ఓపెనర్లు ప్రియాన్ష్ (9), ప్రభ్‌సిమ్రన్ (21) నిరాశపరచగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటర్ మిచెల్ ఓవెన్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్.. నెహల్కు జతకలిసి కింగ్స్ ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించాడు. ఈ ఇద్దరూ ఓవర్‌కు రెండు బౌండరీలకు తక్కువ కాకుండా దంచడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 9 రన్‌రేట్‌కు తగ్గకుండా దూసుకెళ్లింది. నాలుగో వికెట్‌కు 44 బంతుల్లోనే 67 రన్స్ జోడించిన ఈ జోడీని 11వ ఓవర్లో పరాగ్ విడదీశాడు. కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్న నెహల్.. చెలరేగి ఆడాడు. ఆకాశ్ మధ్వాల్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ పూర్తిచేసిన నెహల్.. అతడే వేసిన 16వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి హెట్‌మయర్‌కు క్యాచ్ ఇచ్చాడు. వధెర ఔట్ అయినా శశాంక్.. అజ్మతుల్లా (21 నాటౌట్)తో కలిసి మెరుపులు మెరిపించాడు. మఫక ఓవర్లో అజ్మతుల్లా 4, 6, 4 దంచగా తుషార్ చివరి ఓవర్లో శశాంక్ 6, 4 బాదడంతో ఆ జట్టు ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపింది.
పంజాబ్: 20 ఓవర్లలో 219/5 (నెహల్ 70, శశాంక్ 59*, తుషార్ 2/37, పరాగ్ 1/26);
రాజస్థాన్: 20 ఓవర్లలో 209/7 (జురెల్ 53, జైస్వాల్ 50, బ్రర్ 3/22, యాన్సెన్ 2/41)