చివరి వరకు ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో పంజాబ్‌ది పైచేయి అయింది. మొదట కాన్వే దంచికొట్టడంతో చెన్నై భారీ స్కోరు చేసినా.. చివరి ఓవర్లో ఉత్కంఠను అధిగమిస్తూ పంజాబ్ విజయతీరాలకు చేరింది.
చెన్నై: పరుగుల వరద పారిన పోరులో చెన్నైపై పంజాబ్ ఆధిక్యం సాధించింది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కాన్వే (52 బంతుల్లో 92 నాటౌట్; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీకి చేరువ కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (37), శివమ్ దూబే (28) రాణించారు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (4 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు సిక్సర్లు బాది చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (24 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), లివింగ్‌స్టోన్ (24 బంతుల్లో 40; ఒక ఫోర్, 4 సిక్సర్లు) వేగంగా ఆడగా.. ఆఖర్లో సికందర్ రజా (13 నాటౌట్) విలువైన పరుగులు రాబట్టాడు. చెన్నై బౌలర్లలో తుషార్ 3, జడేజా 2 వికెట్లు పడగొట్టారు.
చెన్నై: 200/4 (కాన్వే 92 నాటౌట్, రుతురాజ్ 37; సికందర్ 1/31), పంజాబ్: 201/6 (ప్రభ్‌సిమ్రన్ 42, లివింగ్‌స్టోన్ 40; తుషార్ 3/49, జడేజా 2/32).