లక్నో : తమ సుదీర్ఘ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఐపీఎల్-18 బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ రెండో మ్యాచ్‌లోనూ దూకుడు కొనసాగించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించిన ‘కింగ్స్’.. మలిపోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పైనా అలవోక విజయం సాధించింది. ఏకనా స్టేడియంలో మంగళవారం జరిగిన పోరులో పంజాబ్.. లక్నోపై 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69, 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నెహల్ వధేర (25 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారంతో ప్రత్యర్థి నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 16.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నోను నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అయుష్ బదోని (33 బంతుల్లో 41, 1 ఫోర్, 3 సిక్సర్లు) ఆదుకున్నారు. ప్రభ్‌సిమ్రన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
పంజాబ్ బ్యాటర్ల దూకుడు ముందు లక్నో నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యం ఏమాత్రమూ సరిపోలేదు. ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్, వధేర ధాటికి లక్నో బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. ప్రియన్ష్ ఆర్య (8) విఫలమైనా కెప్టెన్ అండగా ప్రభ్‌సిమ్రన్ రెచ్చిపోయాడు. శార్దూల్ తొలి ఓవర్లోనే 4, 6తో పరుగుల ఖాతా తెరిచిన అతడు.. బిష్ణోయ్ 6వ ఓవర్లో రెండు బౌండరీలు, సిక్స్‌తో చెలరేగడంతో పవర్ ప్లే ముగిసేసరికే పంజాబ్ 62/1గా నిలిచింది. 23 బంతుల్లోనే అతడి హాఫ్ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో శ్రేయస్ కూడా వేగంగా ఆడటంతో లక్ష్యం కరిగిపోయింది. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని. 11వ ఓవర్లో దిగ్వేశ్ ప్రభ్‌సిమ్రన్‌ను ఔట్ చేయడంతో 84 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు. ప్రభ్‌సిమ్రన్ నిష్క్రమించినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వధేరా ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదడంతో భారీ ఛేదనను ‘కింగ్స్’ మరో 24 బంతులు మిగిలుండగానే ఊదేసింది.
సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడిన లక్నోకు తొలి పవర్ ప్లేలోనే భారీ షాకులు తాకాయి. గత రెండు మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించిన మిచెల్ మార్ష్ (0)ను అర్ష్‌దీప్ తొలి ఓవర్ నాలుగో బంతికే ఔట్ చేసి లక్నోకు భారీ షాకిచ్చాడు. అతడే వేసిన మూడో ఓవర్లో మూడు బౌండరీలతో జోరుమీద కనిపించిన మార్క్మ్ (18 బంతుల్లో 27, 4 ఫోర్లు, 1 సిక్సర్) ఫెర్గూసన్ నాలుగో ఓవర్లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. పంత్ (2) మరోసారి నిరాశపరిచాడు. అతడు క్రీజులోకి రాగానే మ్యాక్స్‌వెల్‌కు బంతినిచ్చిన శ్రేయస్.. ఫలితాన్ని రాబట్టాడు. పవర్ ప్లేలో 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లక్నో ఇన్నింగ్స్ ఆ తర్వాత నెమ్మదించింది. దీంతో చాహల్ వేసిన పదో ఓవర్లో పూరన్.. 4, 4, 6తో గేర్ మార్చాడు. కానీ చాహల్ 12వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన పూరన్.. మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మిల్లర్ (19) విఫలమైనా ఆఖర్లో బదోని అండగా అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు.
లక్నో: 20 ఓవర్లలో 171/7 (పూరన్ 44, బదోని 41, అర్ష్‌దీప్ 3/43, ఫెర్గూసన్ 1/26)
పంజాబ్: 16.2 ఓవర్లలో 177/2 (ప్రభ్‌సిమ్రన్ 69, శ్రేయస్ 52 నాటౌట్, దిగ్వేశ్ 2/30)