Punjab Kings : ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings)లో ముసలం మొదలైంది. 18వ సీజన్‌కు ముందు ఆ ఫ్రాంచైజీలో అంతర్గత కలహాలు తారా స్థాయికి చేరాయి. దాంతో, పంజాబ్ సహ యజమానుల్లో ఒకరైన బాలీవుడ్ నటి ప్రీతి జింతా( Preity Zinta) హై కోర్టును ఆశ్రయించింది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో తన వాటాను అమ్మేందుకు సిద్ధపడిన ఓ ప్రమోటర్‌ను అడ్డుకోవాలని ప్రీతి కోర్టును అభ్యర్థించింది. దాంతో, అసులు ఏమి జరిగిందబ్బా? అంటూ ఈ విషయంపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్(KPH Dream Cricket Private Ltd) అనే కంపెనీ పంజాబ్ కింగ్స్‌ను ప్రమోట్ చేస్తుంది. ఈ కంపెనీలో ప్రీతి జింతాతో కలిపి నలుగురికి వాటాలు ఉన్నాయి. ఇందులో ప్రీతికి 25 శాతం షేర్లు ఉండగా.. మోహిత్ బర్మన్ (Mohit Burman) అనే ప్రమోటర్‌కు అత్యధికంగా 48 శాతం షేర్లు ఉన్నాయి. బర్మన్ ఈ మధ్య తన వాటాను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దాంతో, అతడిని అడ్డుకోవాలని ప్రీతి ఛండీగఢ్ హై కోర్టులో అప్పీల్ చేసింది.
అయితే.. అంతర్జాతీయ ఒప్పందాల్లోని ఆర్టికల్ 19 ప్రకారం ఒక గ్రూప్‌లోని వ్యక్తి తన షేర్లను అమ్మడానికి ముందు సదరు గ్రూప్ సభ్యులకు తెలియజేయాలి. ఒకవేళ గ్రూప్‌లోని వాళ్లు మా వల్ల కాదని చేతులెత్తేస్తే.. అప్పుడు ఇతరులకు అమ్ముకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు వాటాల విక్రయానికి నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రీతి కోర్టు ఫిర్యాదులో పేర్కొంది.
అయితే.. బర్మన్ మాట్లాడుతూ తానేమీ వాటాల అమ్మకానికి సిద్ధపడడం లేదని తెలిపాడు. కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రీతి(27 శాతం), బర్మన్(48 శాతం), నెస్ వాడియా(23 శాతం) అత్యధిక షేర్లు కలిగి ఉన్నారు. మిగిలిన ఆరు శాతం షేర్లు కరన్ పౌల్ అనే వ్యక్తి పేరిట ఉన్నాయి.