చెన్నై : ఐపీఎల్లో నిరుటి రన్నరప్ పంజాబ్ కింగ్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం చిదంబరం స్టేడియంలో జరిగిన పోరులో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. చెన్నైని వారి సొంత ఇలాఖాలో మట్టికరిపించిన పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చెన్నై నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (29 బంతుల్లో 50, 4ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు ప్రభ్‌సిమ్రన్‌సింగ్(43), ప్రియాంశ్ ఆర్య (39), కనోలి (36) రాణించడంతో పంజాబ్ గెలుపు సులువైంది. హెన్రీ, కంబోజ్ రెండేసి వికెట్లు తీశారు. తొలుత కింగ్స్ ఆహ్వానం మేరకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై.. ఆయుష్ మాత్రె (43 బంతుల్లో 73, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరవిహారానికి తోడు శివమ్ దూబె (27 బంతుల్లో 45 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 32, 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. విజయ్‌కుమార్(2/38) రాణించాడు.
చెన్నై ఇన్నింగ్స్‌లో ఆయుష్ ఆటే హైలైట్. సీఎస్కే గంపెడాశలు పెట్టుకున్న సంజూ శాంసన్ (7) చెపాక్‌లోనూ నిరాశపరిచినా కెప్టెన్ రుతురాజ్ (28) అండతో మెరీనా తీరాన మాత్రె రెచ్చిపోయాడు. క్రీజులోకి వస్తూనే బార్ట్లెట్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పిన ఈ యువ సంచలనం.. యాన్సెన్ ఓవర్లో స్కేర్ లెగ్, మిడాన్ మీదుగా రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. ఆ తర్వాత అతడి బాదుడుకు బలైంది స్టోయినిస్. అతడి బౌలింగ్‌లోనూ రెండు భారీ సిక్స్‌లతో 17 రన్స్ రాబట్టడమే గాక 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ఓవర్‌కు పది పరుగులకు తగ్గకుండా సాగుతున్న చెన్నై జోరుకు చాహల్ బ్రేకులు వేశాడు. అతడి 12వ ఓవర్లో బంతిని స్వీప్ చేయబోయిన రుతురాజ్.. బౌండరీలైన్ వద్ద వధేరా చేతికి చిక్కడంతో 55 బంతుల్లో 96 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వైశాక్ వేసిన మరుసటి ఓవర్లో థర్డ్ మ్యాన్ వద్ద చాహల్‌కు క్యాచ్ ఇవ్వడంతో మాత్రె ఇన్నింగ్స్ ముగిసింది. కార్తీక్ (1) విఫలమైనా ఆరో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్.. ఉన్నది కొద్దిసేపే అయినా టెక్నిక్‌తో కూడిన ఆటతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్, వైశాక్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. సర్ఫరాజ్ నిష్క్రమించినా అప్పటికే క్రీజులో కుదురుకున్న దూబె.. భారీ షాట్లతో చెన్నైకి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

ఛేదనను పంజాబ్ దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్ వేగంగా ఆడటంతో పవర్ ప్లేలో ఆ జట్టు 68/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. హెన్రీ రెండో ఓవర్లో ప్రియాన్ష్ 4, 6, 4 బాదగా.. కంబోజ్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ మూడు బౌండరీలతో అలరించాడు. ధాటిగా ఆడే క్రమంలో ఆర్యను హెన్రీ బౌల్డ్ చేసినా.. గత మ్యాచ్ హీరో కూపర్ కనోలితో కలిసి ప్రభ్‌సిమ్రన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించింది. అయితే నూర్ అహ్మద్ 9వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ రనౌట్ అవగా 12వ ఓవర్లో కనోలిని కంబోజ్ ఔట్ చేయడంతో కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 62 రన్స్ అవసరమవగా క్రీజులో ఉన్న కెప్టెన్ శ్రేయస్, వధేరా చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ముఖ్యంగా మంచి ఫామ్‌మీదున్న అయ్యర్.. బౌండరీలతో దుమ్మురేపాడు. తన ఇన్నింగ్స్‌లో 4ఫోర్లు, 3సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. వెంటవెంటనే అయ్యర్, నేహాల్ వధేరా(10) ఔటైనా..శశాంక్సింగ్ (14 నాటౌట్), స్టొయినిస్(9 నాటౌట్) పంజాబ్‌కు అలవోక విజయాన్నందించారు.
చెన్నై: 20 ఓవర్లకు 209/5 (మాత్రె 73, దూబె 45*, వైశాక్ 2/38, చాహల్ 1/21);
పంజాబ్: 18.4 ఓవర్లలో 210/5(అయ్యర్ 50, ప్రభ్‌సిమ్రన్ 43, కంబోజ్ 2/43, హెన్రీ 2/54)
