Anmolpreet Singh | అహ్మదాబాద్: విజయ్ హజారే వన్డే టోర్నీలో తొలి రోజే రికార్డులు బద్దలయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీలో బెర్తు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్లేయర్లు రికార్డుల మోత మోగించారు. అరుణాచల్‌ప్రదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ అన్మోల్ప్రీత్సింగ్(45 బంతుల్లో 115 నాటౌట్, 12ఫోర్లు, 9సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 9 వికెట్ల తేడాతో అరుణాచల్‌ప్రదేశ్‌పై ఘన విజయం సాధించింది.
అరుణాచల్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 12.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి 167 స్కోరు చేసింది. ప్రత్యర్థి పసలేని బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ అన్మోల్ప్రీత్ 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో లిస్ట్-ఏలో వేగవంతమైన సెంచరీ అన్మోల్ ఖాతాలో చేరగా, యూసుఫ్ పఠాన్(40బంతుల్లో) రికార్డు బ్రేక్ అయ్యింది. ఓవరాల్‌గా చూస్తే లిస్ట్-ఏలో వేగవంతమైన సెంచరీ జేక్‌ఫ్రేజర్(29 బంతులు), ఏబీ డివిలీయర్స్(31బంతుల్లో) పేరిట ఉంది. అన్మోల్ తన సుడిగాలి ఇన్నింగ్స్‌లో 12ఫోర్లు, 9 భారీ సిక్స్‌లతో విరుచకుపడ్డాడు.
తొలుత అరుణాచల్‌ప్రదేశ్ 48.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. అశ్వని, మయాంక్ మూడేసి వికెట్లు తీశారు. మరోవైపు ముంబైతో జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో కర్ణాటక 7 వికెట్లతో గెలిచింది. ముంబై విధించిన 383 పరుగుల ఛేదనలో కర్ణాటక..క్రిష్ణన్ శిర్జిత్(101 బంతుల్లో 150 నాటౌట్, 20ఫోర్లు, 4సిక్స్‌లు) భారీ సెంచరీతో 46.2 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. తొలుత ముంబై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(114 నాటౌట్) సెంచరీతో 50 ఓవర్లలో 382/4 స్కోరు చేసింది. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 42 పరుగుల తేడాతో గెలిచింది. అవనీశ్(100)సెంచరీతో రాణించాడు.