పుణె వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. బెంగళూరు టెస్టులో భారీ ఓటమితో వెనుకంజలో ఉన్నటీమ్ఇండియా సిరీస్‌లో పుంజుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగితే..దీటైన పోటీనిచ్చేందుకు కివీస్ సిద్ధమైంది. స్పిన్‌కు సహకరిస్తుందన్న అంచనాలను నిజం చేస్తూ తొలి రోజే యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ధాటికి కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ వికెట్ల వేట మొదలుపెడితే..చాలా రోజుల తర్వాత టెస్టు టీమ్‌లోకి వచ్చిన సుందర్ ఏడు వికెట్లతో విజృంభించాడు. కివీస్ బ్యాటర్లకు తన స్పిన్ తంత్రంతో కళ్లెం వేస్తూ టీమ్ ఇండియాను పోటీలోకి తీసుకొచ్చాడు. సుడిగాలి స్పిన్‌తో వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు సొంతం చేసుకున్నాడు. కివీస్‌ను కట్టడి చేశామన్న ఆనందం భారత్‌కు ఎక్కువసేపు నిలువలేదు.తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ ఇండియా..కెప్టెన్ రోహిత్ వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.రెండో రోజు ఆటలో భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
Washington Sundar | పుణె: భారత్, న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో రోహిత్ సేన పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్‌కు అనుకూలించిన పుణె పిచ్‌పై చెన్నై చిన్నోడు వాషింగ్టన్ సుందర్ (7/59) ఏడు వికెట్లతో విజృంభించాడు. సుందర్ తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేయడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కివీస్ 79 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. సుమారు మూడేండ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న అతడి మాయాజాలానికి పర్యాటక జట్టు బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. డెవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65), మిచెల్ శాంట్నర్ (33) ఆ జట్టును ఆదుకున్నారు. సుందర్‌తో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/64) రాణించడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియా.. ఆదిలోనే రోహిత్ శర్మ(0) వికెట్ కోల్పోయి మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (6 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (10 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఆరంభంలో అశ్విన్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌ను పక్కనబెట్టి గిల్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్‌తో బరిలో నిలిచింది. ఆరంభ ఓవర్లలో పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో 8వ ఓవర్లోనే రోహిత్.. అశ్విన్‌కు బంతినిచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికే అశ్విన్.. కివీస్ సారథి టామ్ లాథమ్ (15)ను వికెట్ల ముందు బలిగొనడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం కొద్దిసేపటికే విల్ యంగ్ (18) వికెట్ల వెనుక పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే కాన్వేకు రచిన్ తోడవడంతో ఈ ఇద్దరూ భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. లంచ్ తర్వాత బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాది అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మూడంకెల స్కోరు దిశగా సాగుతున్న అతడు 44వ ఓవర్లో అశ్విన్ వేసిన బంతి కాన్వే బ్యాట్‌కు ముద్దాడి పంత్ చేతిలో పడటంతో 62 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
సుందర్ మాయ..
కాన్వే నిష్క్రమించినా డారిల్ మిచెల్ (18)తో కలిసి రచిన్ కివీస్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. కానీ రెండో సెషన్ డ్రింక్స్ విరామానికి రెండు ఓవర్ల ముందు సుందర్ మాయ మొదలైంది. 60వ ఓవర్ తొలి బంతికే అతడు అద్భుతమైన డెలివరీతో రచిన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే టామ్ బ్లండెల్ (3)నూ పెవిలియన్‌కు పంపడంతో ఇక అప్పట్నుంచి కివీస్ కోలుకోలేదు. డ్రింక్స్ తర్వాత రెండో ఓవర్లో మిచెల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న వాషింగ్టన్.. గ్లెన్ ఫిలిప్స్ (9)ను బౌల్డ్ చేసి ఆ జట్టును మరింత దెబ్బకొట్టాడు. సౌథీ (5)ని ఔట్ చేసి తన కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. చివర్లో ధాటిగా ఆడిన శాంట్నర్ (33)ను బౌల్డ్ చేసి కివీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ ఏడు వికెట్లు తీస్తే అందులో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం.
తమిళ తంబీల హవా
కివీస్‌తో టెస్టు ఆడుతూ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లలో సుందర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. గతంలో శ్రీనివాస వెంకట్రాఘవన్ (8/72-1965), ఈఎఎస్ ప్రసన్న (8/76-1975), అశ్విన్ (7/59-2017), సుందర్ కంటే ముందున్నారు. పై నలుగురిలో ప్రసన్న మినహా మిగిలిన ముగ్గురూ తమిళనాడుకు చెందినవారే కావడం గమనార్హం.
1 ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సుందర్కుఇదే అత్యుత్తమ ప్రదర్శన
7 స్వదేశంలో టెస్టు ఆడుతూతొలి రోజే స్పిన్నర్లకు పది వికెట్లు దక్కడం భారత్‌కు ఇది ఏడోసారి
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 259 ఆలౌట్ (కాన్వే 76, రచిన్ 65, సుందర్ 7/59, అశ్విన్ 3/64)
భారత్ తొలి ఇన్నింగ్స్ : 16/1 (గిల్ 10, జైస్వాల్ 6, సౌథీ 1/4)