న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత డ‘బుల్లెట్స్’ పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ అసాధారణ ఆటకు కాంస్య పతకం లభించింది. అన్‌సీడెడ్‌గా, ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచ మేటి షట్లర్లు, ముగ్గురు సీడెడ్ ద్వయాలను మట్టికరిపిస్తూ దూసుకెళ్తున్న భారత ద్వయం అద్భుత పోరాటం అంతిమ గమ్యం వరకూ చేరలేకపోయింది. స్వర్ణంపై గురి పెడుతూ ముందుకెళ్లిన ఈ యువ షట్లర్లు సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ప్రత్యర్థులకు తలవంచి కంచు పతకంతో తిరిగొచ్చారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ అయిన గాయత్రి-ట్రీసా 21-18, 13-21, 8-21తో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ లియు షెంగ్ షు-టాన్ నింగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడారు. గంటా 11 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో తొలి గేమ్‌ను గెలుచుకుని ఔరా అనిపించిన భారత జంట ఆ తర్వాత చైనా డ్రాగన్ల ఆధిపత్యానికి లొంగిపోయింది. అయినా ఈ మెగా టోర్నీ మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (2011) తర్వాత మెడల్ గెలిచిన రెండో ద్వయంగా.. ఈ విభాగంలో 15 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం దేశానికి పతకం అందించిన షట్లర్లుగా కొత్త చరిత్ర సృష్టించారు.
చైనా ద్వయంతో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒకేసారి నెగ్గిన గాయత్రి-ట్రీసా ద్వయం ఈ పోరును అద్భుతంగా ఆరంభించింది. తొలి గేమ్‌లో 7-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి చైనా జోడీపై ఒత్తిడి పెంచింది. కానీ, ప్రత్యర్థులు పుంజుకొని వరుసగా 10 పాయింట్లు సాధించి బ్రేక్ టైమ్‌కు 11-7తో ముందంజలో నిలిచారు. ఈ దశలో మళ్లీ జోరు పెంచిన భారత ద్వయం వరుసగా 6 పాయింట్లు సాధించి 12-12తో స్కోరు సమం చేసింది. ట్రీసా క్రాస్ కోర్ట్ విన్నర్‌తో ఆధిక్యంలోకి వెళ్ళింది. 16-18తో రెండు పాయింట్ల వెనుకంజలో ఉన్న దశలో స్టేడియంలోని 8 వేల మంది అభిమానుల కేరింతల గాయత్రి-ట్రీసా అసాధారణ ఆటతీరును కనబరిచారు. ముఖ్యంగా ట్రీసా పవర్ఫుల్ స్మాష్‌లతో విరుచుకుపడింది. దాంతో వరుసగా 5 పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను నెగ్గిన భాతర అమ్మాయిలు.. నంబర్ వన్ ద్వయానికి షాకిచ్చేలా కనిపించారు.
తొలి గేమ్ నెగ్గిన ఉత్సాహంలో రెండో గేమ్‌లోనూ భారత జోడీ పోటాపోటీగా ఆడింది. కానీ, స్కోరు 12-12 వద్ద జరిగిన 49 షాట్ల సుదీర్ఘ ర్యాలీలో చైనా ప్లేయర్లు కీలక పాయింట్ నెగ్గడం మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి ఏకాగ్రత కోల్పోయిన గాయత్రి-ట్రీసా జంట దూకుడు బదులు ఆత్మరక్షణలోకి వెళ్లింది. పదే పదే పొరపాట్లు చేయడంతో చైనా జోడీ వరుస పాయింట్లతో ముందుకెళ్తూ మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. మూడో గేమ్‌లో చైనా జంట తమ అనుభవాన్నంతా ఉపయోగించింది. వేగవంతమైన నెట్ ప్లే, జంప్ స్మాష్‌లతో విరుచుకుపడింది. ఒత్తిడిలో భారత జోడీ వరుస తప్పిదాలు చేసి గేమ్‌తో పాటు మ్యాచ్ కోల్పోయింది.
ఇంత పెద్ద టోర్నీలో 15 ఏండ్ల తర్వాత గాయత్రి-ట్రీసా మహిళల డబుల్స్‌లో భారత్‌కు పతకం అంది ంచడం గర్వకారణం. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి మూడు సీడెడ్ జోడీలను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లడం వారి సత్తాకు నిదర్శనం. ఈ టోర్నీకి సిద్ధమయ్యేందుకు లభించిన ఆరు వారాల సమయం వాళ్ల మైండ్ సెట్‌ను, ఆట తీరును పూర్తిగా మార్చేసింది. ఆ సమయంలో మేం ఇద్దరి ఫిజికల్ ఫిట్నెస్, కోర్టులో వేగాన్ని మెరుగుపరిచేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వ్యూహాత్మకంగా ఎలా ఆడాలో, కష్టమైన సమయాల్లో షాట్ల కచ్చితత్వాన్ని ఎలా కాపాడుకోవాలో కోర్టులో ప్రాక్టీస్ చేయించాం. తమ ర్యాంక్ (39) తక్కువే అయినా ఎదురుగా ఏ దిగ్గజ జంటనైనా ఓడించగల సామర్థ్యం ఉందనే నమ్మకాన్ని వారిలో బలపరిచాం. గాయత్రి కోర్టులో ఆడుతున్నప్పుడు కోచ్‌గా నా ఇతర ప్లేయర్లను చూసినట్లే చూస్తాను. కానీ ఒకే కుటుంబంలో ఇద్దరు క్రీడాకారులు ఉండటం.. ఇద్దరూ అర్జున అవార్డు గ్రహీతలు కావడం చాలా అరుదు. దేవుడి దయ వల్ల ఇది సాధ్యమైంది. గాయత్రి ప్రదర్శన, ఆమె క్రమశిక్షణ చూసి తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా.
– పుల్లెల గోపీచంద్