ఒర్లిన్స్: భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. ఏమాత్రం ఆశలే లేకుండా బరిలోకి దిగిన ఈ 21 ఏండ్ల కుర్రాడు. ఒర్లిన్స్ మాస్టర్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం ప్రియాన్షు 21-15, 19-21, 21-16తో మాగ్నస్ జొహాన్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. నిరుడు థామస్ కప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన ఈ మధ్యప్రదేశ్ షట్లర్.. 68 నిమిషాల పాటు సాగిన పోరులో అదరగొట్టాడు. ప్రియాన్షు కెరీర్లో ఇదే తొలి సూపర్-300 టైటిల్ కావడం విశేషం.
తొలి గేమ్‌లో వరుస పాయింట్లు సాధించిన ప్రియాన్షు విరామ సమయానికి 11-8తో స్పష్టమైన ఆధిక్యం కనబర్చాడు. క్రాస్‌కోర్ట్ షాట్లతో విరుచుకుపడ్డ ప్రియాన్షు.. 18-11తో ఆధిపత్యం కొనసాగిస్తూ తొలి గేమ్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి పుంజుకోవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయంలో ప్రియాన్షు ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేసి 7-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ దశలో డెన్మార్క్ ప్లేయర్ దీటుగా బదులివ్వడంతో స్కోరు 9-9తో సమమైంది. ఈ క్రమంలో ప్రియాన్షు 54 షాట్ల ర్యాలీని నెగ్గడం విశేషం. సుదీర్ఘ ర్యాలీలతో సాగిన పోరులో చివరి వరకు పట్టువదలని ప్రియాన్షు కెరీర్లో అతిపెద్ద టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
ఈ వారం చాలా బాగా గడిచింది. నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. ఎనిమిదేళ్ల వయసు నుంచి జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకుంటున్నా. హైదరాబాద్‌లో శ్రీకాంత్, సమీర్, ప్రణయ్‌లతో కలిసి శిక్షణ తీసుకోవడం కలిసొచ్చింది.