Prithvi Shaw : ప్రధాన దేశవాళీ ట్రోఫీలకు ముందు ముంబై(Mumbai) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. వన్డే కప్(One Day Cup)లో ఫామ్ అందుకున్న భారత స్టార్ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) ఈసారి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ(Syed Mushtaq Ali), విజయ్ హజారే(Vijay Hazare Trophy).. ఈ రెండు ప్రధాన ట్రోఫీల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. షా గాయం గురించి తెలిసిన ముంబై క్రికెట్ ఆసోసియేషన్ అతడిని సంప్రదించింది. దాంతో, సర్జరీ తర్వాత కోలుకునేందుకు సమయం పడుతుందని, తాను ఈ రెండు టోర్నీలకు అందుబాటులో ఉండనని షా వాళ్లతో చెప్పేశాడు. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 23 వరకు జరగనుంది. విజయ్ హజారే ట్రోఫీ నవంబర్ 23న మొదలై డిసెంబర్ 15న ముగుస్తుంది.
ఇంగ్లండ్‌లో జరుగుతున్న వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్(Northamptonshire) జట్టు తరఫున పృథ్వీ షా అదరగొట్టాడు. సొమర్సెట్ (Somerset)పై డబుల్ సెంచరీ (244), డుర్హం జట్టు(Durham)పై సెంచరీ(125 నాటౌట్)తో చెలరేగాడు. అయితే.. డుర్హం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా షా మోకాలికి గాయం అయింది. మొదట్లో చిన్న గాయమే అనుకున్నారంతా. కానీ, స్కానింగ్‌లు తీశాక అనుకున్నదానికంటే గాయం తీవ్రత ఎక్కువ ఉందని తెలిసింది.
పృథ్వీ షా
దాంతో, అతను నార్తంప్టన్‌షైర్ జట్టు మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నిరుడు రంజీల్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన షా ఐపీఎల్ 16వ సీజన్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. దాంతో, భారత జట్టులోనూ చోటు సంపాదించలేకపోయాడు.