హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ రసవత్తరంగా సాగుతున్నది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్నది. రెండో రౌండ్లో విల్లాజియో హైల్యాండర్స్ అగ్రస్థానానికి దూసుకొచ్చింది. చారిత్రక గొల్కోండ పరిసరాల్లో జరుగుతున్న టోర్నీలో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి.
గ్రూపులో టాప్-2లో నిలువడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. గురువారం నాటి పోటీల్లో నిఖిల్ నంజప్ప 38 పాయింట్లతో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. మొత్తంగా విల్లాజియో హైల్యాండర్స్ 196 పాయింట్లతో గ్రూపు-డీలో అగ్రస్థానానికి చేరుకోగా, లహరి కింగ్స్, సింథోకెమ్ స్వింగ్ కింగ్స్ 195 పాయింట్లతో కొనసాగుతున్నాయి. గ్రూపులో టాప్‌లో ఉండటం తమకు సంతోషంగా ఉందని హైల్యాండర్స్ ప్లేయర్ శైలేందర్‌సింగ్ పేర్కొన్నాడు.