ధర్మశాల: ఐపీఎల్లో భాగంగా గురువారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అనూహ్య రీతిలో పంజాబ్ కింగ్స్ జట్టు ఓటమి పాలైంది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింతా(Preity Zinta) నిర్సుత్సాహాని లోనయ్యారు. ఆమె కొంత ఆందోళనలో ఉన్నట్లు కనపించారు. పంజాబ్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో మైదానంలో చాలా సేపు చర్చించారు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భం కెమెరాకు చిక్కింది.
వాస్తవానికి ఫస్ట్ హాఫ్ సీజన్లో పంజాబ్ దూకుడుగా ఆడింది. ప్లే ఆఫ్స్ ఆశలు ఉండేవి. కానీ వరుసగా అయిదో మ్యాచ్ ఓడిపోవడంతో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు ఇప్పుడు ప్లే ఆఫ్స్ అవకాశం కష్టంగా మారింది. ప్రస్తుతం పంజాబ్ జట్టు 12 మ్యాచుల్లో 13 పాయింట్లు సాధించింది. అయితే ప్లే ఆఫ్స్ రేసు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా దూసుకొస్తున్నాయి. ముంబైతో మ్యాచ్ తర్వాత డగౌట్ ఏరియాలో పాంటింగ్‌తో ప్రీతీ జింతా ముచ్చటపెట్టారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాంటింగ్ కూడా బౌండరీ లైన్ వద్దే నిలుచుని పంజాబ్ ఆటగాళ్లను ప్రోత్సహించాడు. కానీ 200 పరుగుల స్కోరును డిఫెండ్ చేసుకోలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు లేకున్నా.. ముంబై జట్టు విజయాన్ని నమోదు చేసింది. తిలక్ వర్మ తన పవర్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. 33 బంతుల్లో అతను 75 రన్స్ చేశాడు. దాంట్లో ఆరు సిక్సర్లు, ఆరు బౌండరీలు ఉన్నాయి. వాస్తవానికి ప్లే ఆఫ్స్‌కు ఏమాత్రం దగ్గరలో లేని ముంబై జట్టు తన విక్టరీతో పంజాబ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టేసింది.