ఉలన్బాతర్ (మంగోలియా) : ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ప్రీతి పవార్, ప్రియా, అరుంధతి ఫైనల్‌కు దూసుకెళ్లారు. సోమవారం ఇక్కడ జరిగిన సెమీస్ పోరులో ఈ ముగ్గురూ తమ ప్రత్యర్థులను చిత్తుచేసి పసిడి పతక పోరుకు అర్హత సాధించారు. మహిళల 54 కిలోల సెమీస్‌లో ప్రీతి.. 5-0తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇమ్ ఎజి (దక్షిణ కొరియా)ను చిత్తుచేసింది. మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థిని తన పంచ్ పవర్‌తో బెంబేలెత్తించిన ప్రీతి.. ఫైనల్ పోరులో మూడుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన చైనీస్ తైపీ బాక్సర్ హువాంగ్ సియావొ-వెన్‌తో తలపడనుంది.
60 కిలోల విభాగంలో ప్రియ.. 5-0తో నమున్ మొంకొర్ (మంగోలియా)ను ఓడించింది. 70 కేజీల సెమీస్‌లో అరుంధతి.. 4-1తో తొయిరొవ (ఉజ్బెకిస్థాన్)ను మట్టికరిపించింది. ఇదిలాఉండగా మాజీ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహెయిన్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. నిఖత్.. 0-5తో పారిస్ ఒలింపిక్ విజేత వు యు (చైనా) చేతిలో ఓడగా లవ్లీనా.. 0-5తో అజిజ జొకిరొవ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఖంగుతింది. పూజారాణి, అంకుషిత సైతం సెమీస్‌లో ఓటమిపాలై కాంస్యాలతో సంతృప్తి పడ్డారు.