న్యూఢిల్లీ: భారత స్టార్ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన శ్రీజేష్ .. ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు విజేతగా నిలిచాడు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డులోకెక్కాడు. 2019లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు భారత మహిళల హాకీ కెప్టెన్ రాణిరాంపాల్ను తొలిసారి ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం స్పెయిన్‌కు చెందిన స్పోర్ట్ ైక్లెంబర్ అల్బెర్టో గినెస్ లోపెజ్, మిచెలో గియోర్డనో (ఇటలీ)తో శ్రీజేష్ తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టోక్యో (2020) ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం దక్కడంలో కీలకంగా వ్యవహరించిన శ్రీజేష్‌కు 1,27,647 ఓట్లు రాగా, లోపెజ్ (67,428), గియోర్డనో (52,046) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. గత కొన్నేండ్లుగా జాతీయ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న శ్రీజేష్ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఈ అవార్డుకు నామినేట్ చేసింది. అవార్డు రావడంపై శ్రీజేష్ స్పందిస్తూ ‘నామినేట్ కావడం వరకే నా వంతు.
ఆ తర్వాత ఓట్లు వేసిన గెలిపించిన హాకీ అభిమానులకే ఈ అవార్డు సొంతం. భారత హాకీకి ఇది గొప్ప సందర్భం. ముఖ్యంగా హాకీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంతోషాన్నిచ్చే వార్త. భారత్‌తో పాటు నాకు ఓటు వేసిన ప్రపంచంలోని వేర్వేరు దేశాల హాకీ సమాఖ్యలకు, సభ్యులకు కృతజ్ఞతలు. ఈ అవార్డు రావడానికి కారణమైన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం మరచిపోలేని అనుభూతి. దీని వెనుక అందరి శ్రమ, పట్టుదల దాగున్నాయి’ అని అన్నాడు. 2006లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఈ కేరళ స్టార్ 244 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు.