న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేసిన క్రీడాకారులకు సముచితం గౌరవం దక్కింది. హాకీకి అసమాన సేవలు అందించిన భారత మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. టోక్యో(2020) ఒలింపిక్స్‌తో పాటు పారిస్(2024) విశ్వక్రీడల్లో భారత హాకీ జట్టు కాంస్య పతకాలు సాధించడంలో శ్రీజేశ్ కీలక పాత్ర పోషించాడు. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా నిలుస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా నిలిచాడు.
టెస్టుల్లో భారత్ తరఫున 537 వికెట్లు తీసిన దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు. తన స్పిన్ నైపుణ్యంతో అశ్విన్ ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. వీరికి తోడు భారత దిగ్గజ ఫుట్‌బాలర్ విజయన్, పారాలింపిక్ స్వర్ణ విజేత హర్విందర్‌సింగ్, పారా అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్‌సింగ్..పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.