కొలంబో: శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఆ టూర్ సమయంలో.. లంక మాజీ క్రికెటర్లు మోదీని కలిశారు. భారత ప్రధానిని కలిసిన వారిలో జయసూర్య(Sanath Jayasuriya), అరవింద డిసిల్వా, కలువితరణ, చమిండ వాస్, కుమార ధర్మసేన ఉన్నారు. 1996లో ప్రపంచ కప్ గెలిచిన ఆ బృందాన్ని మోదీ ప్రశంసించారు. ఆ రోజుల్లోనే టీ20 స్టయిల్ క్రికెట్ ఆడినట్లు ఆయన మెచ్చుకున్నారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశంలో టూర్ చేసేందుకు భారత జట్టును పంపినందుకు మోదీకి లంక మాజీ క్రికెటర్లు ధన్యవాదాలు తెలిపారు.
అయితే ఈ భేటీ సందర్భంగా మాజీ ఓపెనర్ జయసూర్య ఓ రిక్వెస్ట్ చేశారు. శ్రీలంకలో దాదాపు అంతటా క్రికెట్ ఆడుతామని, కానీ జాఫ్నాలో ఆడడం లేదని, శ్రీలంక క్రికెట్ కోచ్గా ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, జాఫ్నాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు సహకరించాలని మోదీని జయసూర్య కోరాడు. ఒకవేళ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తే అది జాఫ్నా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నాడు.
జయసూర్య తమ సాయాన్ని కోరడం సంతోషంగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తన టీం ఈ విషయాన్ని నోట్ చేసుకుందన్నారు. శ్రీలంకలో ఎక్కువ శాతం అంతర్జాతీయ మ్యాచ్లు కొలంబో, పల్లకిలే, గాలే స్టేడియాల్లో జరుగుతుంటాయి. గత ఏడాది లంకలో పర్యటించిన భారత జట్టు కొలంబో, పల్లెకిలేలో మాత్రమే మ్యాచ్ ఆడింది.