IPL 2025| ఢిల్లీ క్యాపిటల్స్ – పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను ధర్మశాల నుంచి ఢిల్లీకి తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు కామెంట్రేటర్స్, బ్రాడ్‌కాస్టింగ్ స్టాఫ్‌ని వందే భారత్ రైలులో బీసీసీఐ ఢిల్లీకి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్-ఢిల్లీ మధ్య ధర్మశాల వేదికగా గురువారం మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేసిన విసయం తెలిసిందే. పాక్ దాడుల నేపథ్యంలో బ్లాక్అవుట్స్ విధించగా.. మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఈ సాంకేతిక లోపం కారణంగా మ్యాచ్‌ని నిర్వహించలేమని బోర్డు స్పష్టం చేసింది. దాంతో మ్యాచ్‌ను రద్దు చేసింది.
ఆటగాళ్లు, సిబ్బంది అందరినీ తరలించేందుకు వందే భారత్ రైళ్లను తరలించాలని నిర్ణయించింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, బ్రాడ్‌కాస్టింగ్ స్టాఫ్ సహా సుమారు 300 మందిని తరలించేందుకు హైస్పీడ్ రైలును పంపింనట్లుగా బీసీసీఐని ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. గురువారం పంజాబ్-ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భద్రతా కారణాల రీత్యా ఫ్లడ్‌లైట్లు ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రేక్షకులను సురక్షితంగా తరలించి, స్టేడియాన్ని ఖాళీ చేయించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 10.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ప్రియాంష్ 34 బంతుల్లో 70 పరుగులు చేసి పెవిలియన్‌కు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధర్మశాల మైదానంలో 23వేల సీటింగ్ సామర్థ్యం ఉంది. స్టేడియాన్ని ఖాళీ చేసిన సమయంలో 80శాతం ప్రేక్షకులతో నిండిపోయింది. మ్యాచ్‌ని నిలిపివేసిన సమయంలో అందరినీ జాగ్రత్తగా బయటకు తీసుకువెళ్లామని.. ఈ సమయంలో ఎవరూ ఆందోళనకు గురికాలేదని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నారు. అయితే, మైదానం నుంచి నిరాశతో వెనుదిరిగిన అభిమానులపై పాక్ తీరును ఎండగట్టారు.