పూణె: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) తాజా ఎడిషన్‌లో యూపీ యోధాస్, పాట్నా పైరేట్స్ సెమీస్‌కు అర్హత సాధించాయి. బుధవారం పూణెలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన తొలి ఎలిమినేటర్‌లో యూపీ.. 46-18తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై జయభేరి మోగించింది. యూపీ తరఫున రైడర్ భవానీ రాజ్‌పుత్ ఏకంగా 12 పాయింట్లతో మెరిశాడు. రెండో ఎలిమినేటర్‌లో పాట్నా.. 31-23తో యూ ముంబాపై గెలిచింది. పాట్నా నుంచి అయన్ 10 పాయింట్లు సాధించగా దేవాంక్ 6 పాయింట్లతో రాణించాడు. గురువారం జరుగబోయే తొలి సెమీస్‌లో యూపీ.. హర్యానా స్టీలర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుండగా రెండో సెమీస్‌లో దబాంగ్ ఢిల్లీ.. పాట్నా పైరేట్స్‌ను ఢీకొననుంది.