పూణె : ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. శుక్రవారం పూణెలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లలో హర్యానా, పాట్నా తమ ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్కు చేరాయి. ఈ టోర్నీ ఆసాంతం రాణిస్తూ టేబుల్ టాపర్గా ఉన్న హర్యానా.. తొలి సెమీస్లో 28-25తో యూపీ యోధాస్ను ఓడించింది. హర్యానా నుంచి శివమ్ (7 పాయింట్లు), వినయ్ (6), రాహుల్ (5) రాణించారు. యూపీ యోధాస్ రైడర్ గగన్ గౌడ 10 పాయింట్లతో పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక రెండో సెమీస్లో పాట్నా 32-28తో దబాంగ్ ఢిల్లీని చిత్తు చేసింది ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో గెలుపు కోసం ఇరు జట్లూ చెమటోడ్చాయి. పాట్నా రైడర్ దేవాంక్ (8), అయాన్ (8) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ (9) పోరాటం వృథా అయింది. హర్యానా, పాట్నా మధ్య ఆదివారం ఫైనల్ పోరు జరుగనుంది.