పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం వెళ్లినా సెక్యూరిటీ విషంయలో భయపడుతూనే ఉంటాయి. అప్పుడెప్పుడో 2002లో న్యూజిల్యాండ్ జట్టు పాక్ టూర్లో ఉండగా.. కివీస్ జట్టు కరాచీలో ఉన్న హోటల్‌కు సమీపంలో బాంబు పేలింది. దాంతో టూర్ రద్దు చేసుకున్న ఆ జట్టు.. వెంటనే స్వదేశం వెళ్లిపోయింది.
ఆ తర్వాత 2009లో పాక్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టును ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. లంక జట్టు వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. దాంతో ఆ తర్వాత పదేళ్ల పాటు ఏ అంతర్జాతీయ జట్టును పాక్‌కు ఆ దేశం ఆహ్వానించలేదు. గతేడాది కూడా సెక్యూరిటీ కారణాలను చూపి న్యూజిల్యాండ్ జట్టు.. పాక్ టూర్‌ను అర్ధంతరంగా రద్దు చేసుకుంది.
ఆ తర్వాత ఇంగ్లండ్ కూడా పాక్ పర్యటనకు రావడం లేదని చెప్పింది. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రమీజ రజా.. అంతర్జాతీయంగా పాక్ క్రికెట్‌ను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే పలు జట్లను పాక్ పర్యటనలకు పిలిచారు. వెస్టిండీస్ వంటి జట్లు అక్కడ విజయవంతంగా టూర్లు ముగించుకున్నాయి కూడా.
దీంతో ధైర్యం తెచ్చుకున్న ఆస్ట్రేలియా జట్టు 1998 తర్వాత తొలిసారి పాక్ పర్యటనకు వెళ్లింది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రావల్ పిండిలో ఈ మ్యాచ్ జరుగుతుండగానే పెషావర్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 50 మంది వరకూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పాక్‌లో పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందే ఆసీస్ ఆటగాడు ఆష్టన్ అగర్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే ఆసీస్ ఆటగాళ్లకు దేశాధ్యక్షులకు అందించే స్థాయి భద్రతను పాకిస్తాన్ అందించినట్లు తెలుస్తోంది. అలాగే ఆసీస్ జట్టు ఈ పర్యటన షెడ్యూల్లో పెషావర్ లేదు. ఈ బాంబు పేలుడు నేపథ్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్న ఆస్ట్రేలియా జట్టు అధికారులు.. తమ దేశ విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
పెషావర్ ఘటన ప్రభావం పాక్-ఆసీస్ సిరీస్‌పై పడే అవకాశం లేదని జట్టు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని బట్టి, జట్టు ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ సిరీస్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.