బెంగుళూరు: విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)కి చెందిన క్రికెట్ మ్యాచ్లను బెంగుళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది. కానీ రేపటి నుంచి జరగాల్సిన మ్యాచ్ వేదికను అకస్మాత్తుగా మార్చేశారు. చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘానికి స్థానిక ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సిటీ పోలీసు కమీషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఇవాళ ఆ విషయాన్ని ప్రకటించారు. జూన్లో ఆర్సీబీ విక్టరీ పరేడ్ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందారని, ఆ ఘటన తర్వాత జస్టిస్ మైఖేల్ డీ కున్హా కొన్ని ప్రతిపాదనలు చేశారని, పోలీసులు కూడా 17 రకాల మార్పులు కోరుతూ ప్రతిపాదన చేశారని, కానీ ఒక్కటి కూడా కర్నాటక క్రికెట్ సంఘం అమలు చేయలేదని, అందుకే మ్యాచ్ నిర్వహణకు పర్మిషన్ ఇవ్వడం లేదని కుమార్ సింగ్ తెలిపారు.
చిన్నస్వామి స్టేడియంకు బదులుగా బీసీసీఐకి చెందిన క్రికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ గ్రౌండ్లో మ్యాచ్లను నిర్వహించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా, కర్నాటక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విజయ్ హజారే మ్యాచ్ వేదికను మార్చేశారు. ఢిల్లీ, ఆంధ్ర మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్నది. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఆడేందుకు విరాట్ కోహ్లీ సిద్దంగా ఉన్నారు. కానీ ఆయన అభిమానులకు నిరాశే మిగలనున్నది. చిన్నస్వామి స్టేడియంకు అనుమతి ఇవ్వకపోవడంతో.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ గ్రౌండ్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ను నిర్వహించనున్నారు. వేదిక మార్పు గురించి రెండు జట్లకు తెలియజేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు.