బెంగళూరు: తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాలను తమకెంతో ఇష్టమైన చిన్నస్వామి స్టేడియంలో చూద్దామనుకున్న కన్నడ క్రికెట్ అభిమానులకు ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ షాకిచ్చింది. ఈ మైదానంలో నిర్వహించతలపెట్టిన విజయ్ హజారే మ్యాచ్లకు హోంమంత్రిత్వ శాఖ అనుమతులివ్వలేదు. ఈ మేరకు బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘చిన్నస్వామిలో మ్యాచ్ (విజయ్ హజారే) ఉంటుందా? లేదా? అన్నదానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందులో ఏమాత్రమూ గందరగోళమూ లేదు. చిన్నస్వామిలో మ్యాచ్ల నిర్వహణ కోసం రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన కమిటీ అధికారులతో కలిసి స్టేడియాన్ని పర్యవేక్షించాం.
కమిటీ సూచనల మేరకు ఇక్కడ మ్యాచ్ల నిర్వహణకు అనుమతులివ్వడం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను మేం ప్రభుత్వం ముందు ఉంచుతాం. కానీ ఇప్పటికైతే ఇక్కడ మ్యాచ్లను నిర్వహించడం కుదరదు’ అని చెప్పారు. ప్రేక్షకుల్లేకుండా అయినా మ్యాచ్ల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరుతూ కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరడంతో హోంమంత్రి పరమేశ్వర కమిటీని ఏర్పాటుచేశారు. చిన్నస్వామిలో మ్యాచ్లకు అనుమతులివ్వకపోవడంతో నేడు జరగాల్సిన ఢిల్లీ, ఆంధ్ర మ్యాచ్ను బీసీసీఐ సీవోఈలో ఆడించనున్నారు.