కమాన్పూర్, ఆగస్టు 28 : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటింది. ఈనెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ స్టేట్ మీట్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ అండర్-18 విభాగంలోని 200, 400 మీటర్ల పరుగు పందేల్లో బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
నల్లవెల్లి శంకర్ – భారతి రెండో కుమార్తె అయిన ఆనంది.. ప్రస్తుతం గుండారంలోని కమాన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. చిన్ననాటి నుంచే పరుగు పందెం పోటీల్లో సత్తా చాటుతున్నది. తాజా ప్రదర్శనతో ఆమె సెప్టెంబర్ 16-18 మధ్య పుదుచ్చేరిలో జరిగే జాతీయ స్థాయి సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది.