Sri Lankan Team | పాకిస్తాన్‌లోని ఇస్లాబాద్లో భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్నది. భద్రతను దృష్టిలో పెట్టుకొని జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు గురువారం తిరిగి శ్రీలంకకు వెళ్లిపోయే అవకాశం ఉందని శ్రీలంక క్రికెట్ వర్గాలు తెలిపాయి. అయితే, శ్రీలంక క్రికెట్ సిరీస్‌లో ఆడేలా ఒప్పించినట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుండగా.. మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నది.
ఇప్పటికే ఈ నెల 11న జరిగిన తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. గురువారం రెండో వన్డే జరుగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌పై అనుమానాలు నెలకొనగా.. శ్రీలంక ఆటగాళ్లను బోర్డు ఒప్పించడంతో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు. గురువారం జరగాల్సిన మ్యాచ్‌ని శుక్రవారానికి మార్చారు. ఈ వన్డే సిరీస్ తర్వాత శ్రీలంక జట్టు పాకిస్తాన్, జింబాబ్వేతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయాలని నిర్ణయించుకోగా.. వారి స్థానంలో ఆటగాళ్ల స్థానంలో కొత్త ఆటగాళ్లను పంపేందుకు ఆలోచించినా.. సిరీస్‌లో ఆడేలా ఒప్పించింది. అయితే, రావల్పిండి ఇస్లామాబాద్‌కు దగ్గరగా ఉండడంతో ఆటగాళ్ల తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్వదేశానికి వెళ్లిపోవాలని ఉందని చెప్పినట్లుగా సంబంధిత వర్గాలు చెప్పాయి.
అంతకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ శ్రీలంక జట్టు అధికారులను కలిసి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 2009లో శ్రీలంక జట్టుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. లాహోర్‌లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడిలో పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ ఘటనలో పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత విదేశీ జట్లు పాకిస్తాన్లో పర్యటించేందుకు నిరాకరించాయి. దాదాపు దశాబ్దం పాటు ఏ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. దాంతో పాక్ తన మ్యాచులన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆడాల్సి వచ్చింది.