దుబాయ్: ఆసియాకప్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో షేక్‌హ్యాండ్ వివాదం( Handshake Row) చెలరేగిన విషయం తెలిసిందే. భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం పట్ల దాయాది దేశం ఐసీసికి ఫిర్యాదు చేసింది. ఓ దశలో టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని కూడా పాక్ ఆలోచించింది. కానీ ఆ నిర్ణయాన్ని విరమించిన పాకిస్థాన్.. తాజాగా రెండో లేఖను ఐసీసీకి రాసింది. ఇండో, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా చేసిన ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు అతన్ని రిఫరీగా పెట్టవద్దు అని పీసీబీ కోరింది. జింబాబ్వే మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ స్థానంలో రిచీ రిచర్డ్సన్ను పెట్టుకోవాలని కోరింది. కానీ ఐసీసీ మాత్రం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ పాకిస్థాన్ ఆడే మరో మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్ రిఫరీగా చేయనున్నారు.
ఆదివారం పాక్‌తో మ్యాచ్ జరిగిన సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా భారత ప్లేయర్లు ప్రత్యర్థి ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండానే మైదానం విడిచి వెళ్లారు. భారత ఆటగాళ్ల వైఖరి పట్ల పాక్ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఆదేశాల మేరకే ఆండీ పైక్రాఫ్ట్ అలా వ్యహరించినట్లు పాక్ టీమ్ డైరెక్టర్ నవీద్ ఆక్రమ్ చీమా ఆరోపించారు.
పెహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు పాక్ క్రికెటర్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వలేదని కెప్టెన్ సూర్యకుమార్ తెలిపారు.