అమరావతి : ప్రపంచ కప్ విజేత, మహిళల అంధుల భారత క్రికెట్ జట్టు ( India Cricket Team) ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందించారు. ఈ మేరకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో శుక్రవారం భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించి, ఒక్కో మహిళా క్రికెటర్ కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళ క్రికెటర్ కు పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు.మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు.
అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.
ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తన సొంత గ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు రహదారి సౌకర్యం కావాలని చేసిన విజ్ఞప్తికి పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించి అందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.