Paralympics | పారిస్: పారాలింపిక్స్‌లో 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఈ క్రీడల ముగింపునకు మరో రెండ్రోజులు గడువు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. పతకాల వేటలో ఆకలిమీదున్న పులుల్లా ఉన్న పారా అథ్లెట్లు భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్ చేర్చడంతో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన క్లబ్ త్రోలో ధరంబీర్ సింగ్, సూర్మ ప్రణవ్ వరుసగా స్వర్ణ, రజతాలతో మెరిశారు. ఇక గురువారం జరిగిన పురుషుల 60 కిలోల జూడోలో యువ జూడోకా కపిల్ పర్మర్ మూడో స్థానంలో నిలవడంతో పారిస్‌లో 25 పతకాలతో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. క్లబ్ త్రోలో స్వర్ణం, రజతంతో పాటు జూడోలో కాంస్యం సాధించడం భారత పారాలింపిక్ చరిత్రలో ఇదే ప్రథమం.
పురుషుల క్లబ్ త్రో (ఎఫ్51) ఈవెంట్లో భారత్ తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజతాలు కైవసం చేసుకుంది. భారత అథ్లెట్ ధరంబీర్ సింగ్.. 34.92 మీటర్ల త్రో తో స్వర్ణాన్ని దక్కించుకోగా మరో అథ్లెట్ సూర్మ ప్రణవ్ 34.59 మీటర్లతో రజతాన్ని గెలుచుకున్నాడు. తొలి నాలుగు త్రోలలో ఫౌల్ చేసిన ధరంబీర్ ఐదో ప్రయత్నంలో మాత్రం రికార్డు త్రో విసిరాడు. సెర్బియా అథ్లెట్ దిమిత్రిజెవిచ్ జెల్కొ (34.18) కాంస్యం గెలిచాడు.
యువ జూడోకా కపిల్ పర్మర్ భారత పారాలింపిక్స్ జూడో చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల 60 కిలోల కాంస్య పోరులో పర్మర్.. 10-0తో డి ఒలివిరా ఎలీల్టన్ (బ్రెజిల్)ను చిత్తుగా ఓడించి పతకం గెలిచాడు. తద్వారా ఈ క్రీడలో దేశానికి తొలి పకతం అందించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. అంతకుముందు సెమీస్‌లో అతడు 0-10తేడాతో ఓడాడు.
ఆర్చరీలో భారత్ తృటిలో పతకం కోల్పోయింది. మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ సెమీస్‌లో ఇటలీ 6-2తో చేతిలో ఓడిన భారత్ కాంస్య పోరులోనూ నిరాశపరిచింది. స్లోవేనియా 5-4తో చేతిలో భారత్‌కు భంగపాటు ఎదురైంది. హర్విందర్ సింగ్-పూజా ద్వయం తొలి సెట్లో ఓడినా తర్వాత పుంచుకున్నారు. రెండు దేశాల ఆర్చర్ల మధ్య పోటీ హోరాహోరిగా జరుగడంతో మ్యాచ్ షూటాఫ్‌కు దారితీసింది. షూటాఫ్‌లో భారత్ 17 పాయింట్లే స్కోరు చేయగా స్లోవేనియా 19 పాయింట్లతో మ్యాచ్‌ను తమవైపునకు తిప్పుకుంది. మహిళల 100 మీటర్ల టీ12 రేసు ఫైనల్లో మన అమ్మాయి సిమ్రన్ శర్మ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం చేజార్చుకుంది.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ‘గత మూడేండ్లుగా మన క్రీడాకారుల సన్నద్ధత, కఠోర శ్రమను బట్టి చూస్తే ఈసారి మేం 25 కంటే ఎక్కువ పతకాలు నెగ్గుతామని నేను కచ్చితంగా చెప్పగలను. వారంతా ప్రణాళికబద్దంగా శిక్షణ పొందారు. అందుకు సంబంధించిన ఫలితాలను మీరు త్వరలోనే చూస్తారు..’ అంటూ పారిస్‌కు వెళ్లబోయే ముందు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) దేవేంద్ర ఝఝారియా చెప్పిన మాటలివి. ఆయన మాటలను మన పారా బృందం చేతల్లో చేసి చూపించింది. ఒలింపిక్స్‌తో సమానంగా నిలిచే ఈ క్రీడలు మొదలైన రెండో రోజే యువ పారా షూటర్ అవని లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం గెలిచి దేశానికి పతకాల బోణీ కొట్టగా అదే రోజు మోనా అగర్వాల్ కాంస్యంతో మెరిసి భారత్‌కు డబుల్ ధమాకా అందించింది. షూటింగ్లో వీరితో మరో ఇద్దరు పతకాలు తీసుకురాగా తర్వాత ఆ బాధ్యతను షట్లర్లు తీసుకున్నారు.
పలు విభాగాల్లో మన షట్లర్లు ఒక స్వర్ణం, రెండేసి రజతాలు, కాంస్యాలు సాధించి అథ్లెట్లలో జోష్‌ను నింపారు. ఇక ఎప్పటిలాగే పారా అథ్లెట్లు పాల్గొన్న ప్రతి క్రీడాంశంలోనూ సత్తా చాటారు. మహిళల వంద మీటర్ల రేసులో యువ రన్నర్ ప్రీతి పాల్ కాంస్యం నెగ్గడంతో అథ్లెటిక్స్‌లో బోణీ కొట్టిన భారత్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్ పుట్, హైజంప్‌లో పతకాల పంట పండించిన మన అథ్లెట్లు టోక్యో పారాలింపిక్స్ పతకాల సంఖ్య (19)ను అధిగమించి ఝఝారియా చెప్పిన లక్ష్యం వైపు వేగంగా కదిలారు.
తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజి మహిళల 400 మీటర్ల రేసులో కాంస్యం నెగ్గగా, రెండు చేతులూ లేకున్నా ఆర్చరీలో పతకం గెలిచిన శీతల్ దేవీ స్ఫూర్తిదాయక పోరాటానికి తోడు గత రెండు పారాలింపిక్స్‌లలో పతకాలు నెగ్గిన తంగవేలు మరియప్పన్ పారిస్‌లోనూ పతకం కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు.
అథ్లెటిక్స్‌లో గురువారం నాటికే దేశానికి 13 పతకాలు (2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యా లు) దక్కించుకుని అంచనాలకు మించి రాణించారు. ఇక గురువారం పారా జూడోలో కపిల్ పర్మర్ కాంస్యం గెలిచి ఈ క్రీడలో తొలి పతకం గెలిచిన భారతీయుడిగా నిలిచాడు. మరో రెండ్రోజులు సాగనున్న ఈ క్రీడలలో భాగంగా పలు క్రీడాంశాలలో బరిలో ఉన్న భారత్ 30 పతకాలను సాధించే దిశగా సాగుతోంది.