నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ‘రెజ్లింగ్‌లో ఆమె కథ ముగిసింది! అందుకే ఈ పసలేని ఆరోపణలు, ఆందోళనలతో పబ్బం గడుపుకుంటుంది!!’ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సహచర రెజ్లర్లతో కలిసి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు వినేశ్ ఫోగాట్‌పై వచ్చిన కామెంట్లు అవి. సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో పాటు మరికొంతమంది రెజ్లర్లతో దేశ రాజధానిలో చేసిన నిరసనలకు ఆమె నేతృత్వం వహించింది. దీనిపై భిన్న వాదనలు వినిపించినా ఏడాదికాలంగా టోర్నీలు లేకపోవడంతో కడుపుమండిన పలు రెజ్లర్లు ‘కొంతమంది స్వార్థం కోసమే ఈ ఆందోళనలు చేస్తున్నారు’ అని విమర్శలు గుప్పించినా వినేశ్ పోరాటాన్ని ఆపలేదు.
గతేడాది దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా అటువైపుగా శాంతియుత ర్యాలీ తీసిన రెజ్లర్లపై పోలీసులు లాఠీచార్జీకి దిగడం, వారిని అరెస్ట్ చేయడం చూసి దేశమంతా నివ్వెరపోయింది. పోలీసులు సైతం రెజ్లర్ల గొంతు నొక్కి, వారిని బందిపోటు దొంగల్లా ఈడ్చుకురావడం చూసి చలించని క్రీడాభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఈ పోరాటానికి నేతృత్వం వహించినవారిలో ముఖ్యురాలిగా ఉన్న వినేశ్‌పై సోషల్ మీడియాలో ఒక పార్టీ అండతో అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర వ్యాఖ్యానాలు, టీవీ చర్చలలో సూటిపోటి మాటలతో వేధించడం చూసి దేశ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
ఒకవైపు ప్రభుత్వం బేటీ బచావో నినాదాలు ఇస్తూ దేశంలో మహిళా క్రీడాకారులను అవమానపరుస్తున్నదని వారికి అండగా దేశం మొత్తం గొంతు కలిపింది. అసలు ఆ సమయంలో వినేశ్ ‘పారిస్’కు అర్హత సాధిస్తుందని కూడా ఎవరూ అనుకోలేదు. దీనికి తోడు కొంతకాలంగా ఆమె గాయాలతోనే సావాసం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఓటములే పలకరించడంతో చాలామంది ఆమె కెరీర్‌కు శుభం కార్డు పడ్డట్టే అని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే తన సహచర రెజ్లర్ అమిత్ పంగల్ సైతం వినేశ్‌ను ఆసియా చాంపియన్‌షిప్‌లో ట్రయల్స్ నిర్వహించకుండా నేరుగా ఎంపిక చేయడం పట్ల కోర్టు మెట్లెక్కడం ఆమెను మరింత కలవరపరించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. మానసికంగా ఎంతో వేధన అనుభవించినా వినేశ్ పోరాటాన్ని మాత్రం వీడలేదు. తనకు చివరి ఒలింపిక్స్ (?)గా భావిస్తున్న పారిస్‌లో పతకం ఖాయం చేసుకున్న ఆమె తనపై కారుకూతలు కూసినవారికి పతకంతోనే చెంప చెల్లుమనే సమాధానం చెప్పింది. సుసాకీపై గెలిచిన తర్వాత ఆమె ముఖంలో కనిపించిన భావోద్వేగాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం!