Lakshya Sen | పారిస్: విశ్వక్రీడల్లో భారత్ తరఫున మరో సంచలనం. బ్యాడ్మింటన్‌లో దేశానికి పతకం పట్టుకొస్తారని భావించిన స్టార్ షట్లర్లంతా తీవ్రంగా నిరాశపరిచి క్వార్టర్స్ పోరు కంటే ముందే ఇంటిబాట పట్టినా అసలు అంచనాలే లేని యువ షట్లర్ లక్ష్యసేన్ మాత్రం సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్.. 19-21, 21-15, 21-12తో చో టీన్ చెన్ (చైనీస్ తైఫీ)పై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లడమే గాక ఒలింపిక్స్‌లో ఈ క్రీడ నుంచి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి పురుష షట్లర్‌గా నిలిచాడు. మొదటి సెట్‌ను త్రుటిలో కోల్పోయినప్పటికీ తర్వాత పుంజుకున్న ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు.. తర్వాత రెండు సెట్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించి ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. సేన్ గెలుపుతో ఈ మెగా ఈవెంట్లో భారత్ మరో పతకం వేటలో ఉన్నట్టే.
సెమీస్‌లో సేన్.. లో కీన్ యీ (సింగపూర్), విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడతాడు. ఈ పోరులో నెగ్గితే భారత్‌కు కనీసం రజతం ఖాయమవ్వనుండగా ఆ మ్యాచ్‌లో ఓడితే కాంస్యమైనా పట్టుకొచ్చే చాన్స్ ఉంది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇప్పటివరకూ సైనా నెహ్వాల్, పీవీ సింధు మాత్రమే సెమీస్ చేరారు. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ (2012) కిదాంబి శ్రీకాంత్ (2016) క్వార్టర్స్ చేరడమే ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రదర్శన. తాజాగా లక్ష్యసేన్ ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు.
నాలుగో పతకం మీద ఆశలు రేపిన ఆర్చర్లు కాంస్య పోరులో గురి తప్పారు. ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భాగంగా అంకితా భకత్, ధీరజ్ బొమ్మదేవరతో కూడిన భారత్.. 2-6 (37-38, 35-37, 38-34, 35-37)తో యూనైటెడ్ స్టేట్స్ ఆప్ అమెరికా (యూఎస్ఏ) చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో 5-1తో ఇండోనేషియాను చిత్తుచేసిన భారత్.. క్వార్టర్స్‌లో 5-3తో స్పెయిన్‌ను ఓడించి సెమీస్ చేరింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దేశం ఖాతాలో మరో కాంస్యం వచ్చేది. అయితే సెమీస్‌లో ధీరజ్ రాణించినా అంకితా పలుమార్లు 7 పాయింట్లే స్కోరు చేసి లక్ష్యానికి గురి తప్పడంతో భారత్‌కు నిరాశ తప్పలేదు.