ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను భాకర్ కొత్త చరిత్ర లిఖించింది. సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో ఇన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చిన పతకాన్ని ఎట్టకేలకు ఒడిసిపట్టుకున్నది. మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను కాంస్య పతకంతో తళుక్కున మెరిసింది.
విశ్వక్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా భాకర్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నది. టోక్యో(2020) ఒలింపిక్స్ చేదు గుర్తులను చెరిపివేస్తూ అద్భుత ప్రదర్శనతో ఈ హర్యానా యువ షూటర్..పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకాన్ని అందించింది.
ఫ్రాన్స్ గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించి ప్రముఖుల ప్రశంసల జల్లులో తడిసిముద్దయ్యింది. కొరియా షూటర్లతో ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పతక పోరులో ఎక్కడా తడబడని భాకర్ పుష్కర కాలం తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు పతక కరువును తీర్చింది. వేర్వేరు విభాగాల్లో రమితా జిందాల్, అర్జున్ బబుతా ఫైనల్స్‌కు చేరి పతక పోరులో నిలిచారు.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతక బోణీ అదిరిపోయింది. పోటీల రెండో రోజే పతకాల ఖాతా తెరిచింది. సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుడుతూ యువ షూటర్ మను భాకర్ కొత్త చరిత సృష్టించింది. తనపై పెట్టుకున్న ఆశలను వమ్ముచేయకుండా చెక్కుచెదరని గురితో కంచు మోత మోగించింది. కొరియా షూటర్లతో ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భాకర్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సగర్వంగా ముద్దాడింది. తద్వారా ఒలింపిక్స్ షూటింగ్లో పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి పతకాలతో రికార్డులు కొల్లగొట్టిన ఈ హర్యానా షార్ప్‌షూటర్ తన కీర్తికిరీటంలో కాంస్యాన్ని చేర్చుకుంది. రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయిన భాకర్ పారిస్ఒలింపిక్స్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్ చేదు అనుభవాలను చెరిపేస్తూ పారిస్‌లో నవ శకానికి నాంది పలికింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని మొదలు ప్రముఖుల ప్రశంసల జడిలో తడిసిముద్ద య్యింది. తమతమ విభాగాల్లో నిఖత్, శ్రీజ, సింధు, మనికా, ప్రణయ్, పన్వర్ సత్తాచాటి పతక పోరులో ముందంజ వేశారు.
Manu Bhaker | పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల బోణీ కొట్టింది. జూలై 28 భారత క్రీడా చరిత్రలో మరుపురాని రోజు. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల షూటింగ్లో పతక కరువు ఎట్టకేలకు తీరింది. చిక్కినట్లే చిక్కి ఇన్ని రోజులు అందని ద్రాక్షలా ఊరిస్తూ వచ్చిన పతకం ఎట్టకేలకు మన ఒడికి చేరింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన యువ షూటర్ మను భాకర్ కాంస్య పతకంతో కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భాకర్ (221.7) కంచు ఒడిసిపట్టుకుంది. హోరాహోరీగా సాగిన పతక పోరులో కొరియాకు చెందిన వైజే ఒహ్(243.2), వైజే కిమ్(241.3) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. మూడో స్థానంతో ఫైనల్ పోరుకు అర్హత సాధించిన భాకర్ అదే స్థానంతో పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా పుష్కర కాలం తర్వాత షూటింగ్లో భారత్‌కు పతకం దక్కేలా చేసింది. చివరిసారి లండన్(2012) ఒలింపిక్స్‌లో విజయ్‌కుమార్(రజతం), గగన్ నారంగ్(కాంస్యం) దేశానికి పతకాలు అందించారు.
చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడల్లో చురుగ్గా పాల్గొన్న మనుకు షూటింగ్ కంటే ముందే ఇతర క్రీడల్లోనూ ప్రావీణ్యముంది. రెజ్లర్లు, బాక్సర్లు, హాకీ ప్లేయర్లు అధికంగా ఉండే హర్యానాలో ఆమెకు స్కూల్ ప్రారంభ దశలోనే క్రీడలపట్ల ఆసక్తి కలిగింది. చిన్నప్పుడు బాక్సింగ్, స్కేటింగ్, వాలీబాల్, మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్ వంటి ఆటల్లో జాతీయ స్థాయిలో ఆమెకు ఏకంగా 60 దాకా పతకాలు కూడా వచ్చాయి. కానీ 2013లో స్కూల్ వాలీబాల్ టోర్నమెంట్ సందర్భంగా ఆమె కన్నుకు గాయమవడంతో మిగిలిన క్రీడలన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేసి 2014 నుంచి పూర్తిగా షూటింగ్ మీదే దృష్టి కేంద్రీకరించింది. హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమున్న ఆమె వాయిలిన్ కూడా నేర్చుకుంది.
మను తన విజయానికి ‘గీతాసారం’ ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపింది. “నేను తరుచూ భగవద్గీత చదువుతాను. ఫైనల్ బరిలో నిలిచినప్పుడు గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన.. ‘కర్తవ్యం మీద దృష్టి సారించు. ఫలితం మీద కాదు’ అన్న బోధనలే నా మదిలో మెదిలాయి. నేను ఏదైతే చేయగలనో అది పూర్తి శ్రద్ధతో చేశాను. ఫలితం నా చేతుల్లో లేదు” అని తెలిపింది. మను తల్లి సుమేధ తరుచూ ఆమెకు గీతలోని ‘య సర్వత్రాణాభిస్నేహస్ తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్న ప్రతిష్టితా’ (ఎవడైతే కష్టాలు వస్తే నిరుత్సాహపడకుండా అదృష్టం వరిస్తే ఆనందపడకుండా అన్ని పరిస్థితుల్లోనూ ఒకే విధంగా ఉంటాడో అతడే స్థిత ప్రజ్ఞుడు) అనే శ్లోకాన్ని చెబుతుందని ఆమె తండ్రి చెప్పాడు.
మనుకు క్రీడల్లో ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమె అభ్యున్నతికి పూర్తిగా సహకరించారు. తన క్రీడలకు సంబంధించిన శిక్షణ, పోటీలలో పాల్గొనడంపై ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. 2014లో మిగతా క్రీడలకు గుడ్ బై చెప్పి షూటింగ్లో జాయిన్ అయితానని చెప్పినప్పుడు మను తండ్రి రాంకిషన్ లక్షా 80 వేల రూపాయలతో కొత్త పిస్టల్ కొనిచ్చారట. ‘నేను నేవీలో ఇంజినీర్‌గా పనిచేసేవాడిని. ఇంటికి వెళ్లగానే మను తనకు కావాల్సిన క్రీడాపరికరాల జాబితాను తయారుచేసి నాకు ఇచ్చేది. షూటింగ్లో జాయిన్ అయ్యాక పిస్టల్ కావాలంటే అప్పటికప్పుడు రూ. 1.80 లక్షలతో కొనిచ్చా’ అని ఆయన తెలిపాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో వైఫల్యంతో చిన్ననాటి కోచ్, గురువు జస్పాల్ రాణాను పక్కనబెట్టిన మను.. 2023లో మళ్లీ ఆయనతో జట్టు కట్టింది. రీ యూనియన్ తర్వాత జస్పాల్.. మనుకు కఠినమైన టాస్క్‌లు అప్పజెప్పాడట. శిక్షణ సందర్భంగా నిర్దేశిత టార్గెట్ పాయింట్లు సాధించకుంటే అందుకు జరిమానాలు విధించేవాడట. ఈ టాస్క్‌లతో మను మరింత రాటుదేలింది. ‘ఒకసారి నన్ను 582 స్కోరు చేయమంటే నేను 578 చేశాను. 4 పాయింట్లు తక్కువైన నాకు 40 యూరోల ఫైన్ విధించాడు. లేదంటే అంత విలువ గల వస్తువులను తీసుకురమ్మనేవాడు. ఇతరులతో పోలిస్తే ఆయన శిక్షణ పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని కాంస్యం గెలిచిన తర్వాత మను చెప్పింది.
10మీటర్ల ఎయిర్ పిస్టల్ పోరు పతక పోరు హోరాహోరీగా సాగింది. నువ్వానేనా అన్నట్లు పాయింట్ పాయింట్‌కు ఉత్కంఠ రేపింది. దాదాపు చివరి షాట్ వరకు భాకర్ కొరియా షూటర్లతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడింది. కిమ్ యెజీ 10.5 పాయింట్లు సాధించగా, భాకర్ 10.3 పాయింట్లతో పసిడి పతక పోరు నుంచి తప్పుకుంది. మొత్తంగా మూడేండ్ల క్రితం టోక్యోలో ఎదురైన వైఫల్యాన్ని భాకర్ కాంస్య పతకంతో కొత్త చరిత్ర లిఖించింది.