విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రపంచమంతా ఒక్క చోట చేరి క్రీడాలోకంలో విహరించే అరుదైన సందర్భం అచ్చెరువొందనుంది. దేశాల సరిహద్దులను చెరిపేస్తూ..క్రీడా జగత్తును తమ అద్భుత విన్యాసాలతో ఓలలాడించే క్షణం మనల్ని కనువిందు చేయబోతున్నది. ఫ్యాషన్‌కు పెట్టింది పేరైన పారిస్ నగరం వేదికగా ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది.
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అద్భుత ప్రదర్శనలతో ప్రత్యర్థులను పడగొడుతూ పతకాలు కొల్లగొట్టేందుకు ప్లేయర్లు చేసే విన్యాసాలు మాటలకందనిది. విశ్వక్రీడావేదికపై తమ జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే ఈ క్షణం కోసం మళ్లీ జన్మిస్తానంటూ ఉప్పొంగిపోయే హృదయాలు ఎన్నో. కోట్లాది మంది అభిమానుల ఆశలు, ఆకాంక్షలను మోసుకుంటూ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టే ప్రతి ప్లేయర్ లక్ష్యం పతకమే. విజయమో, వీరస్వర్గమో అన్న రీతిలో సరిహద్దుల్లో సైనికుల్లా క్రీడాకారులు కడదాకా పోరాడే తీరు మనల్ని కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 17 రోజుల పాటు సరికొత్త క్రీడాలోకంలో విహరించేందుకు యావత్ ప్రపంచం ఒళ్లంతా కండ్లు చేసుకుని చూస్తున్నది. మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా ఒలింపిక్స్‌ను ఆస్వాదిద్దాం పదండి!
Paris Olympics | పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. గతానికి భిన్నంగా ఎలాంటి ఆంక్షలు, నిబంధనలకు తావు లేకుండా స్వేచ్చ, స్వాత్రంత్యానికి ప్రతీకగా పారిస్ విశ్వక్రీడల సంబరానికి వేళయైంది. దశాబ్దం తర్వాత ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న పారిస్..ప్రపంచ క్రీడాకారులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నది. కరోనా నిబంధలన నడమ జరిగిన టోక్యో(2020)కు పూర్తి భిన్నంగా సీన్ నది తీరాన విశ్వక్రీడల మహోత్సవానికి అట్టహాసంగా తెరలేవనుంది.
చారిత్రక ఈఫిల్ టవర్ సాక్షిగా 10,500 మంది ప్లేయర్లు పోటీపడుతున్న ఒలింపిక్స్‌లో ఆరంభ వేడుకలు గతాన్ని తలదన్నే విధంగా చేసేందుకు పారిస్ ప్రభుత్వం నడుము బిగించింది. సుదీర్ఘమైన సీన్ నది పరివాహక ప్రాంతాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతూ ప్రారంభ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వివిధ దేశాల ప్లేయర్లకు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ సాంస్కృతిక కార్యక్రమాలతో పారిస్ నగరం క్రీడాభిమానులను అలరించనుంది. ఫ్రెంచ్ ప్రముఖ థియేటర్ డైరెక్టర్ థామ్ జాలీ పారిస్ నగరాన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్‌గా మారుస్తూ కార్యక్రమాల రూపకల్పన చేశారు.
పతకాలు ఈఫిల్ నుంచి
చారిత్రక ఈఫిల్ టవర్ నుంచి సేకరించిన ఇనుముతో పారిస్ ఒలింపిక్ పతకాలను తయారు చేశారు. హెక్సాగోనల్ ఆకృతిలో పతకాలను ఆకర్షణీయంగా రూపొందించారు. ఓవైపు పారిస్ 2024తో పాటు మరోవైపు గ్రీక్ దేవత ప్రతిమను తీర్చిదిద్దారు.
అతడు, ఆమె సగం

128 ఏండ్ల ఒలింపిక్స్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పురుష, మహిళా అథ్లెట్లు సమానంగా పోటీపడుతున్నారు. ఈ క్రీడా పండుగలో సుమారుగా 10,500 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతుంటే అందులో సగం మంది మహిళలే కావడం విశేషం. ఒలింపిక్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. 1896లో జరిగిన తొలి ఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళలు 241 మంది మాత్రమే. 1996 (అట్లంటా) నుంచి మహిళల ప్రాతినిథ్యం క్రమంగా పెరుగుతోంది. టోక్యోలో మొత్తంగా 11,037 మంది పాల్గొంటే అందులో 47 శాతం మహిళా అథ్లెట్లు కాగా ఇప్పుడు ఆ సంఖ్య 50 శాతానికి చేరింది. అందుకే ఈసారి క్రీడలను ‘లింగ సమానత్వ ఒలింపిక్స్’గా పిలుస్తున్నారు.
పర్యావరణ అనుకూలంగా
గత ఒలింపిక్స్‌కు భిన్నంగా ఈసారి పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా స్టేడియాలను రూపకల్పన చేశారు. ఎక్కడా కూడా శాశ్వత నిర్మాణాల జోలికి వెళ్లకుండా తాత్కాలిక ప్రాతిపాదికన స్టేడియాలు డిజైన్ చేశారు. చారిత్రక ఈఫిల్ టవర్‌ను బేస్ చేసుకుంటూ బీచ్ వాలీబాల్, బ్రేక్ డ్యాన్సింగ్ క్రీడా వేదికలను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్‌ను యువతకు మరింత దగ్గర చేయాలన్న ఉద్దేశంతో సోషల్‌మీడియాను విరివిగా వాడుతున్నారు. ఇదిలా ఉంటే దాదాపు అన్ని క్రీడాంశాలు పారిస్ నగరాన్ని ఆనుకుని జరుగుతుండగా, సర్ఫింగ్ కోసం ఫ్రెంచ్ పసిఫిక్ ప్రాంతంలో ఉన్న తాహితి ప్రాంతంలో పోటీలు నిర్వహిస్తున్నారు.
టార్గెట్ డబుల్ డిజిట్
భారత ఒలింపిక్ చరిత్రలో ఇంతవరకూ సాధ్యంకాని ‘డబుల్ డిజిట్ మెడల్’ కలను ఈసారైనా అందుకోవాలని భారత్ భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాల (ఇప్పటిదాకా ఇదే అత్యుత్తమం) వద్దే ఆగిపోయిన మన క్రీడాకారుల బృందం.. పారిస్‌లో రెండంకెల పతకాల ముచ్చటను తీర్చాలని యావత్ భారతం గంపెడాశలతో ఉంది. 117 మంది క్రీడాకారులతో కూడిన భారత సైన్యం 16 క్రీడాంశాల్లో బరిలో ఉంది.
మునుపటితో పోలిస్తే గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్న మన వీరులు విశ్వక్రీడా యవనికపైనా మెరిసి పతకాల వేట సాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. దేశానికి కచ్చితంగా పతకాలు తెస్తారని ఆశిస్తున్నవారిలో ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బ్యాడ్మింటన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ, హ్యాట్రిక్ మెడల్ వేటలో ఉన్న పీవీ సింధు, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, అసోం అమ్మాయి లవ్లీనా బోర్గొహెయిన్, భారత హాకీ జట్టు, షూటింగ్లో హైదరాబాదీ ఇషా సింగ్, సిఫ్ట్‌కౌర్ సమ్రా, ఆర్చరీలో దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవర, రెజ్లింగ్‌లో వినేశ్ పొగాట్, అమిత్ పంగల్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.
భారీ భద్రత నడుమ
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ నిర్వాహకులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేడుకలు జరుగుతున్నంత సేపు పారిస్ నగరాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోనున్నారు. దాదాపు 150కి.మీల దూరాన్ని పూర్తిగా నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. దీనికి తోడు పారిస్ గగనతలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫైటర్ జెట్స్తో పాటు ఎయిర్‌స్పేస్‌ను పూర్తిగా పర్యవేక్షిస్తుండగా, డ్రోన్స్, షార్ప్‌షూటర్లతో కూడిన హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు.
పారిస్‌కు వర్ష సూచన
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు వేయికండ్లతో ఎదురుచూస్తున్న విశ్వక్రీడల ఆరంభోత్సవ కార్యక్రమాలకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. పారిస్ నగరంలో ఉదయం తేలికపాటి చిరుజల్లులు పడే అవకాశం ఉండగా సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం సమయానికి వర్షం కురిసే అవకాశాలున్నట్టు ఆ దేశ వాతావరణ సంస్థ ‘మెటెవొ-ఫ్రాన్స్’ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
కొత్తగా చేర్చిన క్రీడాంశాలు

ఎప్పటిలాగానే ఈసారి కూడా నిర్వాహకులు ఒలింపిక్స్‌లో 4 క్రీడాంశాలను చేర్చారు. అవి..
బ్రేకింగ్ (హిప్హాప్ డాన్స్‌ను పోలిన క్రీడ), స్కేట్బోర్డింగ్, స్పోర్ట్స్ ైక్లెంబింగ్, సర్ఫింగ్ (సర్ఫ్‌బోర్డ్ పై నిలబడి సముద్రంలో అలలతో సవారీ చేయడం)
‘మస్కట్’గా టోపీ
ఈసారి ఒలింపిక్ మస్కట్‌గా అలరిస్తున్న ‘ఫ్రీజ్’ వెనుక పెద్ద కథే ఉంది. చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడే క్రిస్మస్ తాత పెట్టుకునే టోపీని పోలి ఉన్న ఈ మస్కట్‌ను ‘ఫ్రీజ్’ అని పిలుస్తారు. ఫ్రెంచ్ సంప్రదాయంలో ‘ఫ్రీజియన్ క్యాప్’కు ప్రఖ్యాత ఫ్రెంచ్ విప్లవంతో సంబంధముంది. 17వ శతాబ్దంలో చోటు చేసుకున్న ఫ్రెంచ్ విప్లవంలో ఉద్యమకారులు, ప్రజలు ఈ టోపీని స్వేచ్ఛకు చిహ్నంగా ధరించేవారట. పురాతన గ్రీకు చిత్రాలలోనూ ఈ క్యాప్ ఆనవాళ్లు కనిపిస్తాయి. ‘క్రీడలు ప్రజల జీవితాలను మార్చగలవు’ అనే థీమ్‌తో దీనిని రూపొందించారు.
భారత్ పోటీపడే క్రీడాంశాలు (16)
ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్.
32 : టోక్యోలో 33 క్రీడాంశాలలో 339 మెడల్ ఈవెంట్స్‌ను నిర్వహించగా పారిస్‌లో 32 క్రీడాంశాలు, 329 ఈవెంట్స్
జరుగుతాయి.
3 : 1900, 1924 తర్వాత సరిగ్గా వందేండ్లకు మళ్లీ ఆ దేశం ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.