Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో స్వర్ణం, రజతం, కాంస్యం రాగా.. శనివారం రుబీనా ఫ్రాన్సిస్(Rubina Francis) కాంస్యంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1లో రుబీనా చెక్కు చెదరని గురితో కంచు మోత మోగించింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో రుబీనా 211.1 పాయింట్లు సాధించింది. ఇరాన్‌కు చెందిన సరేహ్ జవన్మర్ది పసిడి గెలిచింది.
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్ల జైత్రయాత్రను రుబీనా కొనసాగించింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1లో క్వాలిఫికేషన్ రౌండ్లో ఆమె అదరగొట్టింది. రుబీనా 556 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి.. ఫైనల్‌కు అర్హత సాధించి పతకంపై ఆశలు రేపింది. ఇక ఫైనల్లోనూ ఆత్మవిశ్వాసంతో గురి పెట్టిన రుబీనా కాంస్యంతో దేశం యావత్తూ సంబురాలు నింపింది.
No stopping the Indian shooters! 💪
Rubina Francis wins a bronze medal in women’s 10m air pistol SH1 event at the Paris 2024 Paralympics. 🙌#Paralympics | #Paris2024 pic.twitter.com/QiDgX0T0Ts
— Olympic Khel (@OlympicKhel) August 31, 2024
పారిలింపిక్స్ మొదలైన రెండో రోజే భారత క్రీడాకారులు దేశానికి నాలుగు పతకాలు అందించారు. తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అవనీ లేఖరా(Aanvi Lekhari) పసిడితో గర్జించింది. రికార్డు స్కోర్‌తో అవనీ వరుసగా రెండో స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. ఇదే పోటీల్లో మోనా అగర్వాల్ (Mona Agarwal) మూడో స్థానంలో నిలిచి కంచు మోత మోగించింది.
అవనీ, మోనా, మనీశ్, ప్రీతి
ఈ ఇద్దరి స్ఫూర్తితో అథ్లెట్ ప్రీతి పాల్ (Preethi Pal) సైతం కాంస్యంతో సంచలనం సృష్టించింది. అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది. యువ పారా షూటర్ మనీశ్ నర్వాల్ (Manish Narwal) సైతం రజతంతో మెరిశాడు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో మనీశ్ సూపర్ గురితో వెండి వెలుగులు విరజిమ్మాడు.