హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకం చేజిక్కించుకుంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో ఈ ఓరుగల్లు బిడ్డ మహిళల 400 మీటర్ల (టీ20) పరుగు పందెంలో 56.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆసియా రికార్డు బద్దలు కొట్టడంతో పాటు స్వర్ణం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడ్డ తొలిసారే అద్భుత ప్రదర్శన కనబర్చిన దీప్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇటీవల ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారి వంద పతకాల మార్క్ దాటి చరిత్ర లిఖించగా.. ఇప్పుడు పారా ఆసియా క్రీడల్లోనూ మనవాళ్ల జోరు కొనసాగుతున్నది. రెండోరోజు మంగళవారం పోటీలు ముగిసేసరికి భారత్ 34 పతకాలతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో 9 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. మంగళవారం మహిళల కనోయ్ (కేఎల్2) విభాగంలో ప్రాచీ యాదవ్ స్వర్ణం నెగ్గగా.. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 54/55/56) లో నీరజ్ యాదవ్ పసిడి పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్లో యోగేశ్, ముత్తురాజ వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు. ఇప్పటికే కనోయ్ (వీఎల్2) విభాగంలో రజతం నెగ్గిన ప్రాచీ.. ఇప్పుడు డబుల్ ధమాకా మోగించింది. ఇతర విభాగాల్లో రవి (ఎఫ్40 షాట్పుట్), ప్రమోద్ (టీ46 1500 మీటర్లు), అజయ్ (టీ64 400 మీ.), సిమ్రన్ (టీ12 100 మీ.) రజత పతకాలు సాధించారు.